‘మోదీ నిర్ణయం వెనుక నితీష్‌ ఉన్నారు’

Bihar Polls: PM Modi Under Pressure From Nitish Says Chirag Paswan - Sakshi

పట్నా: అధికార జేడీయూని వ్యతిరేకిస్తూ బీజేపీకి మద్దతు పలుకుతున్న ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ మరోసారి విమర్శలకు దిగారు. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఒత్తిడి మేరకే ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌ ఎన్నికల ప్రచారంలో 12 ర్యాలీలకు ఓకే చెప్పారని అన్నారు. నితీష్‌ ఒత్తిడి కనుక లేకుంటే ప్రధాని మోదీ అన్నేసి ర్యాలీలకు పచ్చజెండా ఊపేవారు కాదని చెప్పారు. ఇక ఎన్‌డీఏ కూటమి నుంచి బయటికొచ్చిన చిరాగ్‌ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. జేడీయూ ఉండగా ఎన్‌డీఏలో భాగయ్యేది లేదని స్పష్టం చేసిన ఆయన సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి బీజేపీతో కలిసి అధికారాన్ని చేపడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాకాని కాకుండా నితీష్‌ మరోసారి సీఎం అయితే ఎన్‌డీఏలో కలవకుండా ప్రతిపక్షంలో కూర్చుంటామని అన్నారు. 

15 ఏళ్లుగా పాలన సాగిస్తున్న జేయూడీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని చిరాగ్‌ విమర్శించారు. ఇదిలాఉండగా.. ప్రధాని మోదీ ఫొటోలు వాడుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారనే బీజేపీ నేతల విమర్శలపై చిరాగ్‌ శుక్రవారం స్పందించిన సంగతి తెలిసిందే. తన గుండెల్లో మోదీ ఉన్నాడని, అనుమానం ఉన్నవారు తన గుండెను చీల్చి చూసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు చిరాగ్‌ పార్టీకి సీట్లు వచ్చే పరిస్థితి లేదని, ఓట్లు చీల్చేందుకు అతను ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. అయితే, తన తండ్రి స్థాపించిన ఎల్‌జేపీ ఓట్లు చీల్చే పార్టీ అయితే, 2014, 2015, 2019 ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేపీ నేతలను చిరాగ్‌ సూటిగా ప్రశ్నించాడు. కాగా, అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7.. మూడు విడతల్లో బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top