బిహార్ సీఎం పీఠంపై యువ‌నేత క‌న్ను? | Bihar Polls Chirag Paswan Drops BIG Hint At Future Role | Sakshi
Sakshi News home page

సీఎం పీఠంవైపు చిరాగ్‌ చూపు?

Jun 2 2025 7:40 PM | Updated on Jun 2 2025 7:44 PM

Bihar Polls Chirag Paswan Drops BIG Hint At Future Role

అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే యోచనలో కేంద్ర మంత్రి

పట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలకమైన బిహార్‌లో రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా మారేలా కన్పిస్తోంది. కేంద్ర మంత్రి, లోక్‌జన్‌శక్తి (రాం విలాస్‌) పార్టీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ బిహార్‌ సీఎం పీఠంపై కన్నేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే విష‌యాన్ని పరోక్షంగా వెల్ల‌డించారు చిరాగ్‌. బిహార్ రాష్ట్రానికి సేవ చేయ‌డానికే తాను రాజ‌కీయాల్లో వ‌చ్చాన‌ని, కేంద్రంలో ప‌నిచేయ‌డానికి కాద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. "నేను ఎక్కువ‌ కాలం కేంద్ర రాజకీయాల్లో కొన‌సాగాల‌నుకోవ‌డం లేదు. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం బిహార్, బిహార్ ప్రజలు. 'బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్' అనే నా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాన"ని అన్నారు. ఢిల్లీలో ఉంటూ బిహార్ కోసం నేరుగా ప‌నిచేయ‌డం క‌ష్ట‌మ‌ని త‌న‌కు అర్థ‌మైంద‌న్నారు. ఇదే విష‌యాన్ని పార్టీలో చ‌ర్చించిన‌ట్టు చెప్పారు. "నేను నా ఆలోచనలను పార్టీ ముందు ఉంచాను. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల పార్టీకి ప్రయోజనం చేకూరుతుందా లేదా అనేది పార్టీయే అంచనా వేస్తుంద"ని అన్నారు.

సీఎం ప‌ద‌వికి ఖాళీ లేదు
తాను అసెంబ్లీకి పోటీ చేయ‌డం వ‌ల్ల ఎన్డీఏ కూట‌మికి లాభం జ‌రుగుతుంద‌ని భావిస్తే.. బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. "కొన్నిసార్లు జాతీయ నాయకులు రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అది పార్టీ పురోభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంది. మా భాగస్వామ్యం కూటమికి సహాయపడితే, బిహార్‌లో NDA బ‌లోపేతానికి  ఉప‌యోగ‌ప‌డితే నేను అసెంబ్లీకి పోటీ చేస్తాన"ని చిరాగ్ అన్నారు. సీఎం ప‌ద‌విపై తాను క‌న్నేసిన‌ట్టు వచ్చిన వార్త‌ల‌ను ఆయ‌న తోసిపుచ్చారు. బిహార్‌లో ముఖ్యమంత్రి పదవికి ఖాళీ లేద‌ని, నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. కాగా, పాశ్వాన్ ఇంతకు ముందు ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇటీవ‌ల కాలంలో బిహార్‌పై ఆయ‌న ఫోక‌స్ చేయ‌డంతో జాతీయ రాజకీయాల నుంచి అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

జనరల్‌ సీటు నుంచి పోటీ!
చిరాగ్‌ పాశ్వాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగడం ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి. జూన్‌ 8న జరిగే ఎల్జేపీ నవ సంకల్ప సభలో నేతలంతా ఈ మేరకు చిరాగ్‌ను కోరుతూ తీర్మానం చేస్తారని చెబుతున్నారు. ఆయన సీఎం అభ్యర్థిగా బరిలో దిగాల్సిందేనని పార్టీ ఎంపీ అరుణ్‌ భారతి ఆదివారం పీటీఐతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. ఇది పార్టీ కార్యకర్తలు, శ్రేణుల మూకుమ్మడి డిమాండ్‌ అని చెప్పారు. అంతేగాక చిరాగ్‌ ఎస్సీ నియోజకవర్గం నుంచి కాకుండా జనరల్‌ సీటు నుంచి పోటీ చేయాలని ఆయన సూచించారు. తద్వారా చిరాగ్‌ ఏదో ఒక సామాజికవర్గానికి మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న సంకేతాలు పంపడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు.

‘‘చిరాగ్‌ రాజకీయ ప్రస్థానం పూర్తిగా బిహార్‌తోనే ముడివడి ఉంది. మూడుసార్లు ఎంపీగా నెగ్గినా, ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్నా ‘బిహార్‌ ఫస్ట్, బిహారీ ఫస్ట్‌’ అన్నదే తొలినుంచీ ఆయన నినాదం. చిరాగ్‌ స్వప్నమైన స్వయంసమృద్ధ బిహార్‌ సాకారం కావాలంటే ఆయన సారథ్యంలోనే సాధ్యం. రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాలని ముక్త కంఠంతో అడుగుతున్నారు. చిరాగ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలంటూ ఇటీవల ఎల్జేపీ ఎగ్జిక్యూటివ్‌ భేటీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేశాం’’ అని భారతి వివరించారు.

చ‌ద‌వండి: ముస్లిం ఓట్ల కోస‌మే బుజ్జ‌గింపు రాజ‌కీయాలు

బిహార్‌ అసెంబ్లీకి వచ్చే అక్టోబర్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిని బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏకు; ఆర్జేడీ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌కు మధ్య ప్రత్యక్ష పోరుగా భావిస్తున్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీ జన్‌ సురాజ్‌ ఏ మేరకు ఉనికి చాటుకుంటుందన్నది కూడా ఆసక్తికరం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement