రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడంలో ఇబ్బందులు
పార్టీ పుంజుకున్నట్టు కనిపిస్తున్నా...
ఎన్నికల నాటికి చతికిల పడుతున్న వైనం
నితిన్‌నబీన్ పర్యటనలో బయటపడిన క్రమశిక్షణారాహిత్యం, సమన్వయలేమి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో బీజేపీకి మరో శత్రువు లేడు. పార్టీలోనే ఒకరికి ఒకరు శత్రువులు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. ప్రధానమైన ఈ సమస్యను అధిగమిస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’అని రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ ఇటీవలి సమావేశంలో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధినాయకత్వం చేసిన సీరియస్ హెచ్చరికలను రాష్ట్ర నేతలు సీరియస్‌గా తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో వెనుకడుగుపై నిర్దిష్ట కార్యాచరణ రూపకల్పనలో రాష్ట్ర బీజేపీ విఫలమవుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నా యి. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగట్టే విషయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైనా స్పష్టత కొరవడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ముగ్గురు ముఖ్య నేతలు పర్యటించినా....
దాదాపు 40 రోజుల వ్యవధిలోనే బీజేపీకి చెందిన అగ్ర నాయకత్వ త్రయం తెలంగాణలో పర్యటించింది. మే 10న సికింద్రాబద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ, జూన్ 12న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జూన్ 28–30 తేదీల మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబిన్ పర్యటించారు. రాష్ట్ర పర్యటనల విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నా.. రాష్ట్ర బీజేపీ మొక్కుబడిగా అప్పుడప్పుడు క్షేత్రస్థాయి పోరాటాలు తప్ప ఓ స్పష్టమైన దీర్ఘకాలిక కార్యాచరణతో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడంలో వెనుకడుగు తప్పడం లేదంటున్నారు. తెలంగాణలో పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకొని, ప్రజల ఆదరణతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ పుంజుకోవడం మళ్లీ ఎన్నికల ముందు చతికిలబడడం ఓ ప్రహసనంగా మారడంతో అధినాయకత్వం తలపట్టుకుంటోంది.
అధిష్టానం ‘మందు బిళ్ల’పనిచేస్తుందా ?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబిన్ మూడురోజుల పర్యటన సందర్భంగా రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడం, సమన్వయ లేమి సమస్యలుండడాన్ని సహించబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యనేతలు మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గ్రూపులుగా విడిపోవడం, పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడంపై పద్ధతి మార్చుకోవాలని మందలించినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూపులను టాలరేట్ చేసే పరిస్థితి లేదని నితిన్‌నబిన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపక్షించే పరిస్థితి లేదని గట్టి వార్నింగే ఇచ్చారు.
బెంగాల్ కేడర్ కసి ఇక్కడెందుకు లేదు ?
తాజాగా జరిగిన రాష్ట్ర కార్యవర్గభేటీలో పదేళ్లలో తృణముల్ కాంగ్రెస్ పాలనలో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు ఎంతటి పీడన, అణచివేత, హత్యలు, అత్యాచారాలకు గురయ్యారో ఆ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా పనిచేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ వివరించారు. అక్కడ తృణమూల్ అరాచకాలను ఎదుర్కోవడంతోపాటు, 15 వేల మంది కార్యకర్తలు తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లినా వెనుకడుగు వేయకుండా పోరాడారని, అలాంటి నిబద్ధత, కచ్చితంగా ఫలితాలు సాధించాలనే కసి రాష్ట్ర పార్టీలో ఎందుకు కరువైందని ప్రశ్నించారు. రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గసభ్యుల్లో ఎవరు పని చేస్తున్నారు? ఎవరు టైంపాస్ చేస్తున్నారో అధిష్టానం దగ్గర పూర్తి సమాచారం ఉందని బన్సల్ హెచ్చరిచ్చినట్టు తెలిసింది. బెంగాల్‌లో కార్యకర్తల మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసు కేసులకు సైతం వెరవకుండా రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.


