టీడీపీ వల్లే డిస్కమ్‌లపై రూ.30వేల కోట్ల భారం

Balineni Srinivasa Reddy comments on TDP - Sakshi

ఐదేళ్లుగా భారీ నష్టాల్లో కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు

విద్యుత్‌ జేఏసీ విజ్ఞప్తి మేరకు ప్రైవేటుకు లీజుపై సీఎంతో చర్చిస్తాం

రాష్ట్రం మీద ప్రేముంటే సోము వీర్రాజు ప్రధానితో మాట్లాడి నిధులిప్పించాలి

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు: గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకంవల్లే విద్యుత్‌ డిస్కమ్‌లు రూ.30వేల కోట్ల భారాన్ని భరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ఐదేళ్లుగా భారీ నష్టాలను చవిచూస్తోందని.. ఇది ప్రభుత్వానికి భారంగా మారడంతో ఇబ్బందిగా ఉందన్నారు. ప్రైవేటుకు లీజుకిచ్చే అంశంపై విద్యుత్‌ జేఏసీ అడిగిన విజ్ఞప్తికి తాము ఎటువంటి స్పష్టమైన హామీని ఇవ్వలేదన్నారు. అయినా వారి విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇక విద్యుత్‌ జేఏసీతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ్రారెడ్డి, తాను మాట్లాడామని.. జేఏసీ కోరికలన్నీ దాదాపుగా నెరవేరుస్తున్నామన్నారు. అలాగే పీఆర్‌సీకి సంబంధించి కమిషన్‌ కాదు.. కమిటీ వేయాలంటూ విజ్ఞప్తి వచ్చిందని, దీనిని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. 

విద్యుత్‌ సమస్యలను వక్రీకరించడం సబబుకాదు
రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని బాలినేని స్పష్టంచేశారు. ఎప్పుడైనా ఒకటి అరా సమస్యలు రావడం సహజమని, దానిని వక్రీకరించాలని చూస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్‌ విద్యుత్‌ రూ.2.50కు అందుబాటులో ఉంటే ఏకంగా రూ.4.87లకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుందన్నారు. దీనివల్ల విద్యుత్‌ డిస్కంలు ఏకంగా రూ.30 వేల కోట్ల భారాన్ని మోస్తున్నాయన్నారు. అయినప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్‌ అందించే విషయంలో తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు విచిత్రంగా ఉంటున్నాయని.. కేంద్రం నిధులు ఇస్తామంటే వద్దని, అప్పులు ఎవరైనా చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లేలా మాట్లాడడం సరికాదన్నారు. నిజంగా సోము వీర్రాజుకు రాష్ట్రంపై ప్రేమే ఉంటే మోదీతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు ఇవ్వమని కోరాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top