కాంగ్రెస్‌ ఖజానా నింపుతున్న గహ్లోత్‌

Ashok Gehlot filling Congress coffers with corruption money, Pilot turn will not come - Sakshi

రాజస్తాన్‌ కాంగ్రెస్‌ అంతర్గత పోరుపై అమిత్‌ షా

భరత్‌పూర్‌(రాజస్తాన్‌): రాజస్తాన్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలపై బీజేపీ అగ్రనేత అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. శనివారం రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో షా ప్రసంగించారు. ‘ ఓవైపు అవినీతి సొమ్ముతో కాంగ్రెస్‌ అధిష్టానం ఖజానాను సీఎం గహ్లోత్‌ నింపేస్తుంటే మరోవైపు సరైన కారణం లేకుండానే సచిన్‌ పైలట్‌ ధర్నాకు కూర్చుంటున్నారు.

క్షేత్ర స్థాయిలో పైలట్‌ ఎంతగా చెమటోడ్చినా లాభం లేదు. ఎందుకంటే పార్టీ ఖజానాను నింపేస్తూ అధిష్టానం దృష్టిలో పైలట్‌ కంటే గెహ్లాట్‌ కొన్ని మెట్లు పైనే ఉన్నారు. రాష్ట్రాన్ని గెహ్లాట్‌ అవినీతి అడ్డాగా మార్చారు. రాష్ట్ర సొమ్మును లూటీ చేసి ఆ ధనంతో పార్టీ ఖాతా నింపుతున్నారు. దిగబోనని గహ్లోత్‌ సీఎం కుర్చీపై భీష్మించుకుని కూర్చున్నారు. ఈసారి సీఎం కుర్చీ నాదేనని పైలట్‌ ప్రతిజ్ఞ చేస్తున్నారు. వీరిద్దరూ అనవసరంగా అధికారం కోసం పోరాడుతున్నారు.

వాస్తవానికి ఈ దఫా అధికారంలోకి వచ్చేది బీజేపీ’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ‘ వారసత్వ రాజకీయాల కోసమే ఇన్నాళ్లూ గహ్లోత్‌ ప్రభుత్వం పనిచేసింది. కుల రాజకీయాలను రాజేసింది. బుజ్జగింపుల్లో టాప్‌ మార్కులు ఈ ప్రభుత్వానికే పడతాయి.

రాష్ట్రంలో రెండు డజన్లకుపైగా పేపర్లు లీక్‌ అయ్యాయి. అయినా ఇంకా మీకు అధికారం కావాలా గహ్లోత్‌ జీ ? లీకేజీలో సెంచరీ కొడతారా ఏంటి ?. రాష్ట్ర ప్రజలకు మీరిక అక్కర్లేదు. ఈసారి మూడింట రెండొంతుల సీట్లు మావే. మొత్తం పాతిక ఎంపీ సీట్లూ గెల్చేది మేమే’ అని షా ధీమా వ్యక్తంచేశారు. ‘ ఇటీవలే రాహుల్‌ బాబా దేశమంతటా నడుస్తూ భారీ యాత్ర ముగించారు. కాంగ్రెస్‌కు లబ్ధి ఏమేరకు చేకూరుతుందని నన్ను పాత్రికేయులు అడిగారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయిందిగా’ అని షా అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top