బెంగాల్‌లో ఎగరనున్న గాలిపటం!

Asaduddin Owaisi Decides To Contest West Bengal Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా మజ్లిస్‌-ఎ-ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించింది. ఈమేరకు ఏఐఎంఐఎం చీఫ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ బెంగాల్‌ నేతలతో శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను వారితో చర్చించారు. బెంగాల్‌ ప్రతినిధులతో ఈరోజు ఫలవంతమైన చర్చలు జరిగాయని అసదుద్దీన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉన్నతికి చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక వచ్చే ఏడు జరగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేస్తామని ఏఐఎంఐఎం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కాగా, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీకి దిగుతుండటంతో ఆయా పార్టీల్లో కలవరం మొదలైంది. తమ ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి ఎంఐఎం ఏ విధంగా చేటు చేస్తుందోనని బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎంఐఎం దెబ్బతో బిహార్‌లో మహాఘట్‌ బంధన్‌ను అధికారానికి దూరం చేసింది.‌ ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంకులో యాదవులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. ఐదు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా.. చాలా స్థానాల్లో ఆర్జేడీ ఓట్లను చీల్చింది. ఇదిలాఉండగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్లో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. టీఎంసీ వర్గాలే ఈ దాడికి పాల్పాడ్డాయని బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో బెంగాల్‌ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఎంఐఎం కూడా రంగంలోకి దిగడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది.

జాతీయ స్థాయిలో విస్తరణ
ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఎంఐఎం.. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న సంకల్పంతో ఒక్కో రాష్ట్రంలో అడుగు మోపుతుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో వేళ్లూనుకుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబర్చి అదే ఉత్సాహంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి సై అంది. బెంగాల్ అసెంబ్లీలో కనీసం 20 మంది ఎంఐఎం సభ్యులుండేలా ఓవైసీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీమాంచల్ ప్రాంతంతోపాటు.. 24 పరగణాలు, అసన్‌సోల్ వంటి ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీకి బలమైన కేడర్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎంఐఎం టార్గెట్ చేస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top