TDP Leader Pattabhi Arrested: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్‌

AP Police Arrested TDP Leader Pattabhi At Vijayawada - Sakshi

భవానీపురం (విజయవాడ పశ్చిమ)/పటమట (విజయవాడ తూర్పు): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిని దూషించినట్లుగా గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అందిన పిర్యాదు మేరకు పట్టాభిపై సెక్షన్‌ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్‌ విత్‌ 120(బి) కింద (క్రైం నంబర్‌.352/2021) కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం రాత్రి గురునానక్‌నగర్‌లోని కనకదుర్గ ఆఫీసర్స్‌ కాలనీలో రోడ్‌ నంబర్‌ 7లోని ప్లాట్‌ నంబర్‌ 22లో పట్టాభి ఇంటికి చేరుకున్నారు. కాలింగ్‌బెల్‌ కొట్టినా స్పందించకపోవటంతో కొంతసేపు సంయమనంగా వ్యవహరించిన పోలీసులు తరువాత సీఆర్‌పీసీ సెక్షన్‌ 50(3) మేరకు నోటీసు ఇచ్చారు. అనంతరం గవర్నర్‌పేట సీఐ ఎం.వి.ఎస్‌.నాగరాజ ఆయన్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పట్టాభి భార్య చందన పోలీసుల తీరును తప్పుపట్టారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ తన భర్త ఇంట్లో కూడా అసభ్యంగా మాట్లాడరని చెప్పారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదన్నారు. గతంలో ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వారున్నారని, కానీ అప్పుడు స్పందించని ప్రభుత్వం ఇప్పుడు కావాలనే అరెస్టు చేయించిందని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీ అడిగితే తర్వాత ఇస్తామని పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. పోలీసులపై నమ్మకం లేదని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. అరెస్ట్‌కు ముందు పట్టాభి ఒక వీడియోను విడుదల చేశారు. తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, తనకేమైనా జరిగితే ప్రభుత్వానిది, పోలీసులదే బాధ్యత అని ఆ వీడియోలో పేర్కొన్నారు. పోలీసులు పట్టాభిని తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయన్ని గురువారం కోర్టులో హాజరుపరచే అవకాశం ఉందని సమాచారం. 


చంద్రబాబును కూడా అరెస్టు చేయాలి: అంబటి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు పట్టాభితో పాటు, ఇందుకు కర్త, కర్మ, క్రియ అయిన ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుని కూడా అరెస్టు చేయాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిగితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పన్నిన కుట్రకు సంబంధించిన అనేక అంశాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. 

(చదవండి: చంద్రబాబుపై జీవీఎల్‌ ఫైర్‌.. చేసిన తప్పులు ఒప్పుకోవాలని డిమాండ్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top