ఏపీ మంత్రుల శాఖలపై ఇదేం సస్పెన్స్‌? | AP News: Suspense Continues On Chandrababu Ministers Portfolio Allocation | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రుల శాఖలపై ఇదేం సస్పెన్స్‌?

Published Fri, Jun 14 2024 9:33 AM | Last Updated on Fri, Jun 14 2024 10:57 AM

AP News: Suspense Continues On Chandrababu Ministers Portfolio Allocation

అమరావతి, సాక్షి: మం‍త్రులుగా ప్రమాణం చేసి 48 గంటలు ముగిసింది. అయినా కూడా ఇంకా శాఖలు కేటాయించలేదు. అసలు ఎవరికి ఏ శాఖ దక్కుతుందో అని మూడు పార్టీల శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ ఏపీ కేబినెట్‌ కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తులు పూర్తి చేశారా? లేదంటే తర్జన భర్జనలు పడుతున్నారా?..  ఇంకా ఏమైనా చర్చలు జరగాల్సి ఉందా?.  

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఇవాళ సాయంత్రంలోపు ఒక స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక మంత్రుల శాఖల జాబితా వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ, అది జరగలేదు. మరోవైపు కీలక శాఖలు మా నేతలకంటే మా నేతలకే దక్కుతాయంటూ ధీమాగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధానంగా పవన్‌తో పాటు నారా లోకేష్‌కు, అలాగే టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడికి ఏ శాఖ దక్కుతుంది అనేదానిపై ఉత్కంఠ నడుస్తోంది.

ఏపీలో మొత్తం 25 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే.. టీడీపీ నుంచి 20, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరు.. మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. హోం, ఆర్థిక లాంటి కీలక శాఖలను చంద్రబాబు టీడీపీ దగ్గరే ఉంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాన మిత్రపక్షంగా జనసేనకు డిప్యూటీ సీఎంతో పాటు ఏవైనా మూడు ముఖ్య శాఖల్ని కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున ఏకైక మంత్రి సత్యకుమార్‌కు దేవాలయ, ధర్మాదాయ ఇవ్వొచ్చనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.

మంత్రలు శాఖల కేటాయింపు సస్పెన్స్‌కు నేడు తెర పడే అవకాశాలున్నాయి. ఇవాళ మధ్యాహ్నాం తర్వాత సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. మంత్రుల జాబితాపై మరోసారి పునఃసమీక్ష జరిపి  ఈ సాయంత్రం లేదంటే అర్ధరాత్రి పూర్తి జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement