
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కిస్తూ గత వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని టీడీపీ కూటమి సర్కార్ నిలిపివేయడంతో రాష్ట్రంలో రేషన్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రేషన్ షాప్ వద్దకు వచ్చి సరుకులు తీసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో రేషన్ తెచ్చుకొనేందుకు వృద్ధులు, వికలాంగులు తీవ్ర పాట్లు పడుతున్నారు.
పాతపట్నం నియోజకవర్గంలోని గొట్టిపల్లి, పెద్ద రాజపురం, చిన్న రాజపురం, చీపురుపల్లి, పెద్దగూడ, దిగువగూడ, గ్యాసరగూడ, శివుడి మామిడిగూడ, జెన్నోడుగూడ, బలదగూడ, దబ్బాగూడ గ్రామాలకు చెందిన గిరిజనులకు రేషన్ కష్టాలు మొదలయ్యాయి. రేషన్ కోసం కూలి పనులు మానుకోవాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండీయూ వ్యవస్థను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా: ఏజెన్సీలోనూ రేషన్ కష్టాలు మొదలయ్యాయి. కిలోమీటర్ల దూరం వెళ్లి మళ్లీ రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా తమకు చాలా మేలు జరిగిందంటున్న గిరిజనులు.. అదే పథకాన్ని పునరుద్ధరించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.

కోనసీమ జిల్లా: ఇంటి వద్దకే రేషన్ అందించే విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ రేషన్ కష్టాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపుు వద్ద వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. మండుటెండల్లో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.