ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: అంచనాలకు మించి ఆనాడు.. | AP Exit Polls 2024: Rewind 2019 Exit Polls Details | Sakshi
Sakshi News home page

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: అంచనాలకు మించి ఆనాడు..

Jun 1 2024 10:06 AM | Updated on Jun 1 2024 12:45 PM

AP Exit Polls 2024: Rewind 2019 Exit Polls Details

జూన్‌ 4వ తేదీనాటి ప్రజాతీర్పు కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ఫలితాల హ్యాష్‌ ట్యాగులు ఎక్స్‌(పూర్వపు ట్విటర్‌)లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం వెలువడబోయే ఎగ్జిట్‌ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చా నడుస్తోంది. 

ఇక.. 2019 ఏపీ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల నాటి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు.. 2019 మే 23వ తేదీ వెలువడ్డ ఫలితాలతో పోలిస్తే.. ఆ అంచనాలు ఎంత వరకు ఫలించాయో పరిశీల్తిస్తే.. 

2019 మే 19 సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో ఎక్కువ సర్వే సంస్థలు లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపించాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పించి.. లోక్‌సభ స్థానాల్లో 20కి దగ్గర్లో వస్తాయని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పింది. వాటిల్లో.. 

👉లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. టీడీపీ​కి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.

👉 ఆరా మస్తాన్‌ సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.

👉 టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌సీపీకి 18 సీట్లు టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా.

👉 న్యూస్‌ 18- ఐపీఎస్‌ఓఎస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 13 నుంచి 14 సీట్లు వస్తాయి. టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుంది.

లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా.. అంతకు మించే ఫలించింది. 25 స్థానాలకుగానూ 22 పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. 

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని, అలాగే ఏపీ ఎన్నికల్లో తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. ఇక పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. 

👉 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 133 నుంచి 135 వరకు సీట్లు వస్తాయని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) అంచనా వేసింది. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.

👉 వైఎస్సార్‌సీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్‌ పల్స్‌ సర్వే వెల్లడించింది. వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 21 లోక్‌సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.

👉 ఆరా మస్తాన్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.

👉 వీడీపీ అసోసియేట్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 111 నుంచి 121 సీట్లు వస్తాయి. టీడీపీకి 54 నుంచి 64 స్థానాలు దక్కుతాయి. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశముంది.

👉 ఐపల్స్‌ సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 110 - 120, టీడీపీకి 56 - 62, జనసేన పార్టీ 0 - 3 స్థానాలలో విజయం సాధిస్తాయి.

👉 కేకే సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీ 130 - 135, టీడీపీ 30 - 35, జనసేన పార్టీ 10 - 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి

👉  మిషన్‌ చాణక్య సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీ 98 స్థానాల్లో, టీడీపీ 58 స్థానాల్లో, జనసేన పార్టీ 7 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేశారు. 

ఇక్కడా ఆ అంచనాలు మించాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 సీట్లు సాధించి.. చరిత్ర సృష్టిస్తూ సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అధికారాన్ని కైవసరం చేసుకుంది. మరి ఈసారి ప్రతిపక్షం కూటమిగా పోటీ చేసింది. వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలన నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. చూద్దాం.. సాయంత్రం రాబోయే ఎగ్జిట్‌ ఫలితాలు ఎలా ఉంటాయో!.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement