చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీజేపీ నాయకుడు కె. అన్నామలై డిమాండ్ చేశారు. తన పదవికి ఉదయనిధి రాజీనామా చేయాలన్నారు. తమ పార్టీ నాయకుడు అమిత్ మాలవీయపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై గౌరవం లేదని విమర్శించారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను స్టాలిన్ సర్కారు అమలు చేయడం లేదని ఆరోపించారు.
"అమిత్ మాలవీయకు సంబంధించిన కేసులో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి 48 గంటల క్రితం ఇచ్చిన తీర్పులో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మత విశ్వాసాలపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు జాతి నిర్మూలనకు దారితీసేలా ఉన్నాయన్నారు. తమిళనాడు పోలీసులు కనీసం ఇప్పుడైనా ఉప ముఖ్యమంత్రిపై చర్య తీసుకోవాలి. ఇది నిజంగా చట్టబద్ధమైన ప్రభుత్వం అయితే, ఆయన నుంచి రాజీనామా లేఖ తీసుకోవాల''ని అన్నామలై అన్నారు.
చెన్నైలో మూడేళ్ల క్రితం ఈ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. మలేరియా, డెంగ్యూ వ్యాధుల్లా.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నారు. దీన్ని మారణహోమానికి పిలుపుగా అమిత్ మాలవీయ (Amit Malviya) వర్ణించారు. దీంతో తమిళనాడు పోలీసులు ఆయనపై అప్పట్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది.
కోర్టు తీర్పులను లెక్కచేయడం లేదు
కోర్టు తీర్పులను స్టాలిన్ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదని అన్నామలై తాజాగా ఆరోపించారు. తిరుప్పరంకుండ్రం కేసుతో సహా అనేక వివాదాల్లో కోర్టు ఆదేశాలు అమలు కాలేదని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని అన్నారు. మరో 50 రోజుల పాటు ప్రజలు డీఎంకే ప్రభుత్వ దారుణాలను భరించాల్సి ఉంటుందని చెప్పారు. ''డీఎంకే, వామపక్ష పార్టీలు ఏ తీర్పును ఆమోదించవు. న్యాయమూర్తి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకపోతే.. వారు కులం, మతం ఉపయోగించి దుర్భాషలాడేందుకు ప్రయత్నిస్తారు. కమ్యూనిస్ట్ పార్టీలు పేదల కోసం పోరాడతాయని పేరుండేది. కానీ డీఎంకేతో చేతులు కలిపిన తర్వాత తోక పార్టీలుగా మారిపోయాయ''ని ధ్వజమెత్తారు.


