అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!

Andheri East Bypoll: Uncertain Over Rutuja Latke Candidature - Sakshi

తూర్పు అంధేరీ ఉప ఎన్నిక.. ఉద్ధవ్‌ వర్గం అభ్యర్థిగా రుతుజా లట్కే

తమ అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్న సీఎం శిందే

బీఎంసీ ఉద్యోగానికి రుతుజా రాజీనామా.. లభించని ఆమోదం

రాజీనామాను ఆమోదించాలని ఆదేశించిన హైకోర్టు

సాక్షి, ముంబై: తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం అభ్యర్ధి రుతుజా లట్కేను తమవైపు లాక్కునేందుకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపినట్లయింది. మొన్నటివరకు అసలైన శివసేన పార్టీ తమదేనంటూ, విల్లు–బాణం (ధనుశ్య–బాణ్‌) గుర్తు తమకే దక్కాలని ఇటు ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, అటు ఏక్‌నాథ్‌ శిందే వర్గం పోటీ పడ్డాయి. చివరకు ఎన్నికల సంఘం తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం వినియోగించరాదని ఉద్ధవ్‌కు, శిందేను ఈసీ ఆదేశించింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. కానీ రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ టికెట్టుపై పోటీ చేయించాలనే ప్రయత్నాలు శిందే చేస్తున్నారు. 


భర్త మృతి.. అభ్యర్థిగా భార్య

ఈ ఏడాది మార్చిలో కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లిన తూర్పు అంధేరీ నియోజక వర్గం శివసేన ఎమ్మెల్యే రమేశ్‌ లట్కే అక్కడే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. నవంబర్‌ మూడో తేదీన ఉప ఎన్నిక, ఆరో తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. కాని మృతి చెందిన రమేశ్‌ లట్కే సతీమణి రుతుజా లట్కేకు తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే అభ్యర్ధిత్వం ఇచ్చారు. సానుభూతి ఓట్లతో రుతుజా సునాయాసంగా గెలుస్తుందనే ధీమాతో ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నారు. రుతుజా గెలవడంవల్ల తమ పార్టీ ఎమ్మెల్యే సంఖ్య యథాతధంగా ఉంటుంది.


ఏక్‌నాథ్‌ శిందే ఎత్తుగడలు

రమేశ్‌ లట్కే కుటుంబంతో ఏక్‌నాథ్‌ శిందేకు సంత్సంబంధాలున్నాయి. దీంతో రుతుజాకు తమ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం ఇవ్వాలని శిందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే శివసేన వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య తగ్గిపోయి, తమ వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య పెరుగుతుందని శిందే భావిస్తున్నారు. ప్రస్తుతం శివసేన పార్టీ ఎవరిది..? విల్లు–బాణం ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకునే అధికారం సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే సమయంలో ఎమ్మెల్యేల సంఖ్య ఏ వర్గానికి ఎక్కువ ఉందో ఆ వర్గానికి శివసేన పేరు, విల్లు–బాణం గుర్తు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతో ఏక్‌నాథ్‌ శిందే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 

నలిగి పోతున్న బీఎంసీ కమిషనర్‌
కాగా ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం తరపున రుతుజా లట్కే గురువారం భారీ బలప్రదర్శన చేస్తూ నామినేషన్‌ వేస్తారని ఇదివరకే పార్టీ వర్గాలు ప్రకటించాయి. రుతుజా లట్కేకు మహావికాస్‌ ఆఘాడి మద్దతు ఉంటుందని కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా ప్రకటించాయి. కానీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆమె బీఎంసీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల మూడో తేదీన ఆమె బీఎంసీ కమిషనర్‌కు రాజీనామా సమర్పించారు. కానీ కమిషనర్‌ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఫలితంగా గురువారం ఆమె నామినేషన్‌ వేయలేకపోయారు. దీంతో రాజీనామా ఆమోదించాలని ఇటు ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం నుంచి, ఆమోదించవద్దని అటు ఏక్‌నాథ్‌ శిందే వర్గం నుంచి బీఎంసీ కమిషనర్‌పై ఒత్తిడి వస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్యలో బీఎంసీ కమిషనర్‌ నలిగి పోతున్నారు.  


నియమాలు ఏమంటున్నాయి..

బీఎంసీ 1989 నియమాల ప్రకారం స్వచ్చందంగా పదవీ విరమణ పొందేవారు మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. రాజీనామా చేసే వారు నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఒకవేళ నెల రోజుల ముందు నోటీసు ఇవ్వని పక్షంలో ఒక నెల వేతనం బీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. కాని ఆమె ఈ నెల మూడో తేదీన నోటీసు ఇచ్చారు. నియమాల ప్రకారం రుతుజా లట్కే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వకపోవడంతో నెల రోజుల వేతనం రూ.67,590 నగదు బీఎంసీకి చెల్లించారు. సంబంధిత డిపార్టుమెంట్‌ నుంచి నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) కూడా పొందారు. అయినప్పటికీ బీఎంసీ కమిషనర్‌ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఇటు ఉద్ధవ్‌ వర్గం, అటు శిందే వర్గం ఒత్తిళ్ల మధ్య బీఎంసీ కమిషనర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారో ఉత్కంఠ నెలకొంది. రాజీనామ ఆమోదించే వరకు రుతుజాకు నామినేషన్‌ వేయడానికి వీలులేదు. దీంతో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం బాంబే కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు రుతుజా రాజీనామాను ఆమోదించాలని ఉన్నత న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది. 


బీజేపీ నుంచి మూర్జీ పటేల్‌ ?

ఇదిలాఉండగా బీజేపీ నుంచి మూర్జీ పటేల్‌ పేరును దాదాపు ఖరారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. నామినేషన్‌ వేయడానికి శుక్రవారం వరకు గడువుంది. ఆలోపు ఏదైన అద్భుతం జరగవచ్చు. గతంలో తనతో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ తరఫున నామినేషన్‌ వేయించాలనే ప్రయత్నంలో శిందే ఉన్నారు. ఒకవేళ రుతుజా బీజేపీ తరఫున నామినేషన్‌ దాఖలుచేస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దుమారం లేపడం ఖాయమని చెప్పకనే చెబుతోంది. దీంతో రుతుజా తుది నిర్ణయం తీసుకోవాలంటే ఆచి, తూచి ఆడుగేయాల్సి ఉంటుంది. 

ఒకవేళ శిందే ఒత్తిళ్లకు యపడి బీజేపీ తరఫున రుతుజా నామినేషన్‌ వేస్తే మూర్జీ పటేల్‌ పరిస్ధితి ఏంటనే అంశం తెరమీదకు రానుంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూర్జీ పటేల్‌కు అభ్యర్ధిత్వం ఇవ్వకపోవడంతో బీజేపీపై తిరుగుబాటుచేసి స్వతంత్రంగా బరిలో దిగారు. ఆ సమయంలో రమేశ్‌ లట్కే గెలుపొందగా మూర్జీ పటేల్‌ రెండో స్ధానంలో నిలిచారు. రుతుజా బీజేపీ తరఫున నామినేషన్‌ వేస్తే ఇప్పుడు అదే పరిస్ధితి పునరావృతమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా కొంత అయోమయ పరిస్ధితిలో ఉన్నట్లు తెలుస్తోంది. (క్లిక్: ‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్‌ రౌత్‌ భావోద్వేగ లేఖ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top