బీజేపీ ఫోకస్‌: కారు.. సారు టార్గెట్‌!

Amit Shah sabha targeting TRS and KCR - Sakshi

టీఆర్‌ఎస్, కేసీఆర్‌ లక్ష్యంగా అమిత్‌ షా సభ

పథకాల అమల్లో వైఫల్యం, అవినీతి అంశాలు లేవనెత్తే అవకాశం

రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని చూపే ప్రయత్నం 

‘డబుల్‌ ఇంజన్‌’ సర్కార్‌తో ప్రయోజనాలను వివరించే యోచన\

బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు, దాడులను ఖండించే చాన్స్‌ 

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ఉద్దేశం 

నేడు తుక్కుగూడలో బండి పాదయాత్ర ముగింపు సభ

భారీగా జన సమీకరణపై బీజేపీ దృష్టి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన బీజేపీ.. టీఆర్‌ఎస్‌ సర్కారు, సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా దాడి ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. శనివారం హైదరాబాద్‌ శివార్లలోని తుక్కుగూడలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓవైపు టీఆర్‌ఎస్‌ సర్కారు, సీఎం కేసీఆర్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి మరింత సానుకూలత తెచ్చుకునేలా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా షా ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.  

సంజయ్‌ రెండో విడత యాత్ర ముగింపుతో.. 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలకు పాల్పడిందని, కాళేశ్వరం ఏటీఎంగా మారిపోయిందని ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అమిత్‌షా సభ కూడా రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌లను లక్ష్యంగా చేసుకునే సాగనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి, అక్రమాల ఆరోపణలకు తోడు కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, కేంద్ర నిధులను మళ్లిస్తోందని అమిత్‌షా ధ్వజమెత్తే అవకాశముందని పేర్కొంటున్నాయి. 

పథకాలను ప్రస్తావిస్తూ.. 
రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తోందంటూ అమిత్‌షా తన ప్రసంగంలో ఎండగట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, దళితబంధు తదితర హామీల అమల్లో వెనకడుగు, బియ్యం, వడ్ల కొనుగోళ్ల వైఫల్యం.. ఆయుష్మాన్‌ భారత్, పీఎం ఆవాస్‌ యోజన, పీఎం కిసాన్‌ వంటి కేంద్ర పథకాలను తెలంగాణలో పూర్తి స్థాయిలో అమలుచేయకపోవడాన్ని ప్రస్తావిస్తారని అంటున్నాయి. ఉపాధి హామీ సహా అనేక పథకాల ద్వారా గ్రామీణాభివృద్ధికి, ఇతర రంగాలకు నిధులిస్తున్నా.. కేంద్రం సహకరించట్లేదంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రులు విమర్శలు చేయడాన్ని ఎత్తిచూపుతారని పేర్కొంటున్నాయి. 

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌పై.. 
టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని.. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ సర్కార్‌ ఏర్పడితే డబుల్‌ ఇంజన్‌తో తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే సందేశాన్ని అమిత్‌షా ఇస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. బీజేపీకి ఆదరణ పెరుగుతుండటాన్ని సహించలేక పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడ్తున్నారని.. దాడులకు పాల్పడుతున్నారనే అంశాన్ని లేవనెత్తుతారని అంటున్నారు.

ఖమ్మంలో పార్టీ కార్యకర్త సాయిగణేశ్‌ ఆత్మహత్య, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలపై స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుల బెదిరింపులు, దాడులనూ ప్రస్తావిస్తారని పేర్కొంటున్నారు. ఇలాంటి దాడులకు భయపడొద్దని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు తెగించి పోరాడాలని అమిత్‌షా భరోసా ఇస్తారని చెప్తున్నారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే పూరిస్థాయిలో సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ నేతలు వివరిస్తున్నారు. 
 
రాష్ట్రంలో గరం.. గరం.. 
వాస్తవానికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయముంది. అయినా ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం పోటాపోటీ కార్యక్రమాలతో వేడి పుట్టిస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్‌ రాహుల్‌గాంధీతో సభ నిర్వహించడం.. టీఆర్‌ఎస్‌ నేతలు కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తుండటం, బీజేపీని టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పిస్తుండటం.. ఇదే సమయంలో బీజేపీ పాదయాత్ర, సభలకుతోడు తాజాగా అమిత్‌షా పర్యటనతో అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. అమిత్‌షా బీజేపీ ఎన్నికల ఎజెండాను ప్రస్తావించడంతోపాటు తనదైన శైలితో విమర్శలతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ చర్చలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వానికి తెరలేపే అవకాశం ఉందని రాజకీయ వేత్తలు అంటున్నారు. 
తుక్కుగూడ సభకు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు 
 
తుక్కుగూడ సభకు సర్వం సిద్ధం 
 సాక్షి, రంగారెడ్డిజిల్లా/సాక్షి, హైదరాబాద్‌:  తుక్కుగూడలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభకు బీజేపీ సర్వం సిద్ధం చేసింది. ఔటర్‌రింగ్‌రోడ్డును ఆనుకుని ఉన్న 40 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. భారీగా జనాన్ని సమీకరించాలని నిర్ణయించిన నేతలు.. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది చొప్పున సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సభాస్థలిని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇతర నేతలు పరిశీలించారు. సభాస్థలం, ప్రధాన రహదారుల వెంట కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ జాతీయ, రాష్ట్ర నేతల ఫొటోలతో పెద్ద సంఖ్యలో కటౌట్లు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. 

1,500 మందితో బందోబస్తు 
కేంద్ర మంత్రి అమిత్‌షా వస్తుండటంతో తుక్కుగూడ సభకు పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభాస్థలితోపాటు ఆయన పర్యటించే మార్గాల్లో గట్టి బందోబస్తును సిద్ధం చేశారు. ఎస్పీ, డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, మహిళా పోలీసులు సహా 1,500 మంది సిబ్బందిని మోహరిస్తున్నారు. వంద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని తాత్కాలిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించి భద్రతను పర్యవేక్షించనున్నారు. సభాస్థలంలో వేదికపైకి వెళ్లేందుకు అమిత్‌షా, ఇతర వీఐపీల కోసం ప్రత్యేక మార్గాన్ని సిద్ధం చేశారు. 

► ఇక వాహనాల ట్రాఫిక్, పార్కింగ్‌కు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, అప్పా జంక్షన్ల మీదుగా వచ్చే వాహనాలను శంషాబాద్‌ నుంచి తుక్కుగూడకు మళ్లించనున్నారు. అటు వరంగల్, విజయవాడ, నాగార్జునసాగర్, శ్రీశైలం జాతీయ రహదారులపై వచ్చే వాహనాలను రావిర్యాల మీదుగా తుక్కుగూడకు అనుమతిస్తారు. ఫ్యాబ్‌సిటీ, అయ్యప్ప ఆలయం, సభా ప్రాంగణం వెనుక స్థలం, మంఖాల్‌లోని మరో మూడు స్థలాలు కలిపి 10కిపైగా పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. 

అమిత్‌షా షెడ్యూల్‌ ఇదీ.. 
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమనాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ కాసేపు బీజేపీ నేతలతో భేటీ అవుతారు. తర్వాత రామంతాపూర్‌లోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలోని హోటల్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 6 గంటలకు తుక్కుగూడ సభాస్థలికి చేరుకుని ప్రసంగిస్తారు. రాత్రి 8.30 గంటల సమయంలో తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top