చంద్రబాబుకు చాదస్తం మరీ ఎక్కువైంది

Ambati Rambabu and Taneti Vanitha Fires On Chandrababu - Sakshi

మంత్రి అంబటి మండిపాటు 

రాత్రి పూట ఎవరైనా ప్రాజెక్టును సందర్శిస్తారా? 

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మా బాధ్యత

ఆయన నిర్వాకం వల్లే నిర్మాణం ఆలస్యం

సత్తెనపల్లి:  పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు పిచ్చి, చాదస్తం కాకపోతే రాత్రి 7 గంటల సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వయసు ప్రభావం వల్ల చాదస్తం మరీ ఎక్కువైందని ఎద్దేవా చేశారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కూడా నేరుగా లబ్ధిదారులకు బటన్‌ నొక్కితే వెళ్లేలా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారన్నారు. అదీ తమ చిత్తశుద్ధి అన్నారు. ఎక్కడా, ఏ విధమైన పొరపాట్లు జరగవని చెప్పారు. ఎక్కడైనా సరే అధికారులు, సిబ్బంది తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టుపై అభూత కల్పనలు సృష్టించి, తద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. 2018లోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని డబ్బాలు కొట్టిన బాబును ప్రజలు ఇంటికి పంపారన్నారు. బాబు నిర్వాకం వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. అన్ని అడ్డంకులను అధిగమించి, ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. ప్రారంభోత్సవానికి చంద్రబాబునూ ఆహ్వానిస్తామన్నారు.

ఇందులో తొందర పడాల్సిందేమీ లేదని చెప్పారు. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ఎక్కడా తప్పు పట్టలేదన్నారు. మొట్టమొదట ట్రాన్స్‌ట్రాయ్‌ ఏజెన్సీ ఉంటే, చంద్రబాబు దానిని తొలగించి నవయుగకు ఇచ్చారని, ఆ తర్వాత తమ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మెఘాకు ఇచ్చిందని చెప్పారు. వాళ్లు మారిస్తే తప్పులేదు కానీ, తాము మారిస్తే తప్పా అని ప్రశ్నించారు.

ఈరోజు పూర్తవుతుంది.. రేపు పూర్తవుతుందని చంద్రబాబులా అసత్యాలు చెప్పమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమవుతుందని పునరుద్ఘాటించారు. చంద్రబాబు తొందరపడబట్టే డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయిందన్నారు.

చంద్రబాబుది రోజుకో డ్రామా
హోంమంత్రి తానేటి వనిత మండిపాటు
కొవ్వూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోజుకో డ్రామా చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఆయన తీరుపై ప్రజలు ఇదేమి ఖర్మరా బాబూ.. అని మాట్లాడుకుంటున్నారని చెప్పారు. గురువారం ఆమె తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో మీడియాతో మాట్లాడారు. పోలవరం వద్ద కావాలనే చంద్రబాబు రాద్ధాంతం చేశారన్నారు.

టీడీపీ హయాంలో పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా జన సమూహంతో అదీ రాత్రి పూట పాజెక్టు వద్దకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. తన హయాంలో ఏం చేశారో చెప్పకుండా రోడ్లు పట్టుకొని తిరిగితే ప్రజలు నమ్ముతారని ఆయన భావిస్తున్నారన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top