
తిరువనంతపురం: కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. రెండో దశ కోవిడ్ భారత్‌ను మరింతగా దెబ్బకొట్టింది. అయితే, కరోనా తొలి దశలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి అదుపుతప్పింది. అయితే కోవిడ్ పోరులో కేరళ మాత్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కేరళ సమర్ధంగా ఎదుర్కోవడంలో అప్పటి కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ (64) కృషి చేశారు. ఆమె పనితీరుపట్ల ఎందరో ప్రశంసలు కురిపించారు.
ఈక్రమంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వం ఆరోగ్య మంత్రిగా కేకే శైలజకే పగ్గాలు అప్పగిస్తుందని అందరూ భావించారు. ప్రస్తుత కేబినెట్‌లో ఆమెకు మొండి చేయే ఎదురవనుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కేకే శైలజ కన్నూర్ జిల్లాలోని మత్తనూర్ నియోజకవర్గం నుంచి 60 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కోవిడ్ మొదటి దశలో వైరస్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కోవడంలో శైలజా టీచర్ "రాక్‌స్టార్" ఆరోగ్య మంత్రిగా ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా నిఫా వైరస్ సంక్షోభ కాలంలో కూడా ఆమె పనితీరుకు ప్రశంసలు దక్కాయి. గత ఏడాది సెప్టెంబరులో, యూకేకు చెందిన ప్రాస్పెక్ట్ మ్యాగజైన్ ఆమెను "టాప్ థింకర్ ఆఫ్ ది ఇయర్ 2020" గా కూడా ఎంపిక చేసింది.
మరోవైపు ప్రస్తుత మంత్రివర్గంలో పినరయి విజయన్ తప్ప మిగతా అందరూ కొత్త వారేనని సమాచారం. ఆయన అల్లుడు పీఏ మహ్మద్ రియాస్, పార్టీ కార్యదర్శి ఏ విజయరాఘవన్ భార్య ఆర్.బిందు కూడా కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కించుకోనున్నట్టు తెలిసింది. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకుడు ఎన్‌ఎం పియర్సన్ స్పందిస్తూ... "పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కూడా ఓ కారణం. ఒక వేళ జట్టు మొత్తాన్ని మార్చితే... అది కెప్టెన్‌కు కూడా వర్తింపజేయాలి’’ అంటూ చురకలంటించారు.
(చదవండి: Kerala: 20న విజయన్ ప్రమాణస్వీకారం)