కాంగ్రెస్‌ది రుధిర వ్యవసాయం

Agriculture Minister Narendra Singh Tomar Fires On opposition - Sakshi

విపక్షంపై మండిపడ్డ వ్యవసాయ మంత్రి తోమర్‌

అనంతరం, విమర్శలు రావడంతో రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యల తొలగింపు

సాగు చట్టాల్లో ఒక్క తప్పూ లేదు; అయినా సవరణలకు సిద్ధపడ్డామన్న మంత్రి

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ రక్తంతో వ్యవసాయం చేస్తుందని, బీజేపీ అలా కాదని రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ విపక్షంపై మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్‌ విడుదల చేసిన ఒక పుస్తకంలోని వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. తోమర్‌ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో అనంతరం వాటిని రికార్డుల నుంచి తొలగించారు. ‘మేం తీసుకువచ్చిన చట్టాలను నల్లచట్టాలని అంటున్నారు. ఆ చట్టాల్లో నలుపు(తప్పు) ఎక్కడ ఉందని, రైతులకు వ్యతిరేకంగా అందులో ఏం ఉందని రెండు నెలలుగా రైతులను అడుగుతున్నాం. రైతు వ్యతిరేకత ఎక్కడ ఉందో చూపిస్తే సరిదిద్దుతామని కూడా చెబుతున్నాం. వారి నుంచి జవాబు లేదు. వీరి(విపక్ష సభ్యులను చూస్తూ) నుంచీ జవాబు లేదు’అని వ్యాఖ్యానించారు.

రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ మార్కెట్లు, కనీస మద్దతు ధర విధానం కొనసాగుతాయని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తోమర్‌ పునరుద్ఘాటించారు. సవరణలకు సిద్ధంగా ఉన్నామంటే దానర్ధం చట్టాల్లో లోపాలున్నాయని తాము అంగీకరించనట్లు కాదని, రైతుల ఆందోళనలను గౌరవించి, సవరణలకు సిద్దమయ్యామని వివరించారు. రైతులే కాదు, వారి మద్దతుదారులు కూడా వ్యవసాయ చట్టాల్లో ఏ ఒక్క లోపాన్ని కూడా చూపలేకపోయారని తెలిపారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేయడం లేదని, కేవలం ఒక్క రాష్ట్రానికి చెందిన రైతులే ఉందోళనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారిని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు సమాచారంతో రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నీటితో వ్యవసాయం చేస్తారని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్‌ మాత్రం రక్తంతో వ్యవసాయం చేస్తుంది. రక్తంతో సాగు చేయడం బీజేపీకి తెలియదు’అని మండిపడ్డారు. వ్యవసాయ మార్కెట్లకు వెలుపల కోరుకున్న ధరకు, ఎలాంటి పన్ను లేకుండా తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం తాజా చట్టాలతో రైతులకు లభిస్తుందన్నారు.

కాంట్రాక్ట్‌ వ్యవసాయంతో రైతులు పన్ను లేకుండానే తమ ఉత్పత్తులకు అమ్ముకోవచ్చని, ఒప్పందం నుంచి ఎలాంటి పరిహారం చెల్లించకుండానే వైదొలిగే అవకాశం కేంద్రం తీసుకువచ్చిన చట్టాల్లో ఉందని వివరించారు. కానీ, పంజాబ్‌లో అమల్లో ఉన్న చట్టం(పంజాబ్‌ కాంట్రాక్ట్‌ లా) అందుకు విరుద్ధంగా ఉందని, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రైతు.. జరిమానా చెల్లించడంతో పాటు జైలుకు కూడా వెళ్లేలా ఆ చట్టంలో నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. అంతే కాదు, ఆ చట్టం ప్రకారం తమ ఉత్పత్తులను అమ్మే రైతులు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారని, అయితే, అహంకారం ఎక్కడ ఉందని, చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, చివరకు చట్టాల అమలును 18 నెలల పాటు నిలిపేసేందుకు కడా సిద్ధమైందని చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యుడు వినయ్‌ సహస్రబుద్ధే వ్యాఖ్యానించారు.సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు.

‘కరోనా కన్నా ముందే ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రారంభమైంది.  ప్రభుత్వం ప్రకటించిన అనాలోచిత లాక్‌డౌన్‌తో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో రైతులు న్యాయం కోసం యుద్ధం చేస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. సాగు చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలని కాంగ్రెస్‌ సభ్యుడు ప్రతాప్‌ సింగ్‌ బాజ్వా వ్యాఖ్యానించారు. రైతు నిరసన కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ‘బెర్లిన్‌ వాల్‌’తో పోల్చారు. జనవరి 26న రైతు ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా జరిగిన అల్లర్లపైనిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నిజాలు మాట్లాడిన వారిని ద్రోహులంటున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై దేశద్రోహం కేసులు పెడ్తున్నారని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. విపక్ష సభ్యులకు తోమర్‌ సరైన, వివరణాత్మక జవాబు ఇచ్చారని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఈ ప్రసంగాన్ని ప్రజలంతా వినాలని  ఆ ప్రసంగం వీడియో లింక్‌ను ట్యాగ్‌ చేశారు.  

సంప్రదాయాల ప్రకారమే..
వ్యవసాయ బిల్లులను రూపొందించే విషయంలో ప్రభుత్వం అన్ని సంప్రదాయాలను పాటించిందని, రాష్ట్రాలతో పాటు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తీసుకుందని ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపింది.

లోక్‌సభ సోమవారానికి వాయిదా
సాగు చట్టాలకు వ్యతిరేకంగా లోక్‌సభలో విపక్షాల నిరసనతో శుక్రవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ఫిబ్రవరి 3న ప్రారంభించిన బీజేపీ ఎంపీ లాకెట్‌ చటర్జీకి, ఆ తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించే అవకాశమే లభించలేదు. శుక్రవారం కూడా  సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్‌ వద్దకు దూసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో, సభను సోమవారానికి స్పీకర్‌ వాయిదా వేశారు.

భయపడను: మీనా హ్యారిస్‌
.భారత్‌లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ సోదరి కుమార్తె, న్యాయవాది, రచయిత మీనా హ్యారిస్‌(36) మరోసారి తేల్చిచెప్పారు. రైతులకు మద్దతుగా ట్వీట్లు చేసినందుకు తనను దూషిస్తూ ఇండియాలో జరిగిన ప్రదర్శనల ఫొటోను ఆమె ట్విట్టర్‌లో తాజాగా షేర్‌ చేశారు. ‘‘భారతదేశంలోని రైతుల మానవ హక్కులకు మద్దతుగా మాట్లాడుతూనే ఉంటా. భయపడే ప్రసక్తే లేదు. నిశ్శబ్దంగా ఉండను’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రైతుల పోరాటం గురించి మీనా హ్యారిస్‌ కొన్ని రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పాప్‌ స్టార్‌ రిహన్నా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి. వారిపై ప్రభుత్వ అనుకూల వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నాయి.

గ్రెటానా.. ఆమెవరో నాకు తెలియదు: తికాయత్‌
రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుపై శుక్రవారం భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ స్పందించారు. విదేశాల్లోని ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు తమ ఉద్యమానికి మద్దతిస్తే ప్రభుత్వానికి సమస్య ఏంటని ప్రశ్నించారు. అయితే, ఉద్యమానికి మద్దతుగా ట్వీట్స్‌ చేసిన పాప్‌ సింగర్‌ రిహానా, నటి మియా ఖలీఫా, యువ పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బర్గ్‌ సహా ఆ ప్రముఖులంతా ఎవరో తనకు తెలియదన్నారు. ‘ఎవరు వారంతా?’ అని ఆసక్తిగా మీడియాను ఎదురు ప్రశ్నించారు. వారెవరో వివరించిన తరువాత.. ‘వారు మా ఉద్యమానికి మద్దతిస్తే సమస్యేంటి? వారు మాకేమీ ఇవ్వడం లేదు. ఏమీ తీసుకెళ్లడం లేదు’ అని వ్యాఖ్యానించారు.  

ఢిల్లీలో చక్కా జామ్‌ లేదు
నేడుతలపెట్టిన రహదారుల దిగ్బంధన కార్యక్రమం ‘చక్కా జామ్‌’ను ఢిల్లీలో  నిర్వహించడం లేదని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద ఇప్పటికే ‘చక్కా జామ్‌’ పరిస్థితి ఉన్నందున ప్రత్యేకంగా ఆ కార్యక్రమం అవసరం లేదని భావిస్తున్నామంది. దేశవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధన కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, యూపీలోని శామలి జిల్లా భైన్స్‌వాల్‌లో శుక్రవారం జరిగిన రైతు మహాసభకు వేలాదిగా రైతులు హాజరయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top