ప్రతి విద్యార్థి ప్రాణం మాకు ముఖ్యమే: మంత్రి ఆదిమూలపు

Adimulapu Suresh Series On Lokesh Comments About Government - Sakshi

సాక్షి, విజయవాడ : నారా లోకేష్ వాడిన పదజాలం తీవ్ర ఆక్షేపణీయమని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌కు చదువు విలువ తెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి విధానాలు తెలుస్తాయని అన్నారు. లోకేష్ ముందుగా నిజా నిజాలు తెలుసుకోవాలని, లేకుంటే అతన్ని ఒక ఎర్రి నాయుడుగా జమకట్టే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. లోకేష్ లాగా ఎవరో ఫీజులు కడితే, ఎవరో పరీక్షలు రాస్తే స్టాన్ఫర్డ్ డిగ్రీ అని చెప్పుకోవట్లేదని, 4.5 లక్షల నూతన అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలలో జరిగాయని స్పష్టం చేశారు.

కోవిడ్ నేపథ్యంలో 1 నుంచి 9 వరకు తరగతులు నిర్వహించడం లేదని మంద్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. వేసవి సెలవులు ఏప్రిల్ 20 నుంచి ఇచ్చామని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలన్నింటిలో 9వ తరగతి వరకు విద్యార్థులను హాస్టళ్ల నుంచి పంపించామని పేర్కొన్నారు. యూనివర్సిటీ విద్యపై మరొక సమీక్ష నిర్వహిస్తామని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత ముఖ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. పబ్బం గడుపుకోవాలని లోకేష్ మాట్లాడిన మాటలు విద్యార్థులను, తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. ప్రతి విద్యార్థి ప్రాణం తమకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలకు మాత్రం ప్రభుత్వ చర్యలు కనిపించడం లేదని అన్నారు.

కోవిడ్ కాలంలో కూడా మాజీ సీఎం చంద్రబాబు వకీల్ సాబ్‌కు వకాల్తా పుచ్చుకున్నారని మండిపడ్డారు. తన తండ్రి వకీల్ సాబ్‌కు కోవిడ్ కాలంలో వకాల్తా పుచ్చుకున్నపుడు లోకేష్‌కు కోవిడ్ కనిపించలేదా అని ప్రశ్నించారు. ఒక జూమ్ కాన్ఫరెన్స్ ద్వారానే విద్యార్థుల ఆరోగ్య బాధ్యత తీసుకుంటున్నారా అని లోకేష్‌ అనడం సరికాదన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు లోకేష్ ఒకసారి తెలుసుకోవాలన్నారు. లోకేష్ కనుక రాష్ట్రంలో ఉండి ఉంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలిసి ఉండేవని, మంత్రివర్గ ఉపసంఘం సమావేశంపై రేపు సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. బాధ్యత రహితంగా, రెచ్చగొట్టే విధంగా నారా లోకేష్ మాటలున్నాయని విమర్శించారు.

చదవండి: నారా లోకేష్‌పై ఆర్జీవీ సంచలన కామెంట్లు..!
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top