రైతుల్ని నట్టేట ముంచిన ఘనుడు చంద్రబాబు

Adimulapu Suresh fires on Chandrababu - Sakshi

చంద్రబాబుపై మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫైర్‌

అమరావతి ప్రాంత రైతులకు రూ.184.99 కోట్ల కౌలు విడుదల

సాక్షి, అమరావతి: వ్యవసాయం దండగ అని చెప్పి రాష్ట్రంలోని రైతుల్ని నట్టేట ముంచిన ఘనుడు చంద్రబాబు అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. పచ్చటి పొలాలతో కళకళలాడే వేలాది ఎకరాల అమరావతి ప్రాంత పొలాలను ఎడారిగా మార్చిన ఘనత కూడా ఆయనదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత రైతులకు 2022–23 సంవత్సరానికి సంబంధించిన కౌలు నగదు రూ.208.10 కోట్లను మంగళవారం విడుదల చేశారు. 24,739 మంది ఖాతాల్లో రూ.184.99 కోట్లను జమ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ రైతులను పట్టించుకోలేదని, వారి సంక్షేమం కనీసం ఆలోచన కూడా చేయలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రైతుల ఆత్మహత్యలే అందుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రైతు పక్షాన నిలబడి అనేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, అమరావతి రైతులకు రావాల్సిన అన్ని రాయితీలు అందజేస్తున్నామని తెలిపారు. అమరావతి ప్రాంతానికి, అక్కడి రైతులకు ఏమీ చేయలేకపోయిన  చంద్రబాబుకు అక్కడి భూములపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

24,739 మంది రైతుల ఖాతాల్లో కౌలు జమ
అమరావతి రైతులకు వరుసగా మూడో ఏడాది కౌలు నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో నం. 277 జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి  మంగళవారం రూ.208.10 కోట్లు విడుదల చేశారు. అంతకుముందు 2020–21లో రూ.182.26 కోట్లు, 20 21–22 సంవత్సంలో రూ.187.75 కోట్లు చెల్లించా రు. ఈ ఏడాది విడుదల చేసిన కౌలు నిధుల్లో రూ.184,99,37,974 మొత్తాన్ని 24,739 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు.

మిగిలిన మొత్తం అసైన్‌మెంట్‌ భూములకు, సివిల్‌ వివాదాలు ఉన్న భూ ములకు సంబంధించిందని మంత్రి సురేష్‌  తెలిపా రు. వివాదాలు తేలిన తర్వాత ఆ మొత్తం వారి ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు. జరీబు భూములకు ఎకరాకు రూ.50 వేలు, మెట్ట భూములకు రూ.30 వేల చొప్పున చెల్లించడంతో పాటు ఏటా 10 శాతం కౌలు పెంచి రైతులకు చెల్లిస్తున్నట్టు వివరించారు. మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top