సాక్షి, విజయవాడ: చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్ ఓ జోకర్ అని మండిపడ్డారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. జనసేన పార్టీని పెట్టించిందే చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు కాపులను ఎదగకుండా చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు తీసుకుని, కాపులను యాచించే స్థాయికి పవన్ దిగజార్చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో రూ. కోటి 20 లక్షలతో నిర్మించిన వంగవీటి మోహన రంగా కాపు కమ్యూనిటీ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు,మేయర్ రాయన భాగ్యలక్ష్మి ,డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ.. తనను నమ్ముకున్న జనసేన కార్యకర్తలు , వీరమహిళలకు పవన్ ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు.
పవన్ పేరుకే పవర్ స్టార్ అని.. పొత్తుల విషయంలో ప్యాకేజీ స్టార్ అయిపోయాడని విమర్శించారు. పవన్ ముఖ్యమంత్రి అవుతాడని కాపులంతా నమ్మారని, కాపులకు నమ్మకద్రోహం చేసిన వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. పవన్ ఈ రాష్ట్రానికి చుట్టంచూపుగా వచ్చి వెళ్తాడని ఎద్దేవా చేశారు. ఆయనను కాపు సోదరులు ఎవరూ నమ్మొద్దని హితవు పలికారు. టీడీపీ,జనసేన, బీజేపీకి ఏపీతో సంబంధం లేదన్నారు. ఈ రాష్ట్ర ప్రజలను తన కుటుంబంగా భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కాపులంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
చదవండి: ఫైనల్‌గా ఫిక్స్.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
