జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు ఆవిర్భావ వేడుకలు శనివారం పరిపాలనా భవనం ఆవరణలో నిర్వహించనున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫయాజ్ తయ్యబ్ ఎన్టీపీసీ జెండా ఆవిష్కరించనున్నారు. సాయంత్రం పీటీఎస్‌లోని మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో మెగా సాంస్కృతిక కార్యక్రమం, ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖప్రియ బృందంతో ప్రత్యేక సంగీత, సాంస్కృతిక ప్రదర్శన, అనంతరం విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
వంటావార్పుతో నిరసన
పెద్దపల్లి: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు శుక్రవారం వంటావార్పుతో నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె 32వ రోజు కొనసాగించారు. నాయకులు మాట్లాడుతూ.. సమాన పనికి వేతనం అందించాలన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో నర్మద, సాధిక్ పాషా, శ్రావణ్, విశ్రాంతి, కొమురయ్య, అనిత, రాధ, మేఘమాల, శంకర్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్‌కాలనీ అల్లూరు గ్రామంలో ఇల్లందుల రాజయ్యగౌడ్(63) శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. రాజయ్యగౌడ్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వివరించారు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు సీఐ ప్రసాద్‌రావు తెలిపారు. తన మృతికి ఎవరూ కారణం కాదని, ఆరోగ్యం బాగోలేక చనిపోతున్నానని రాసిపెట్టుకున్న సూసైడ్ నోట్ మృతుడి జేబులో లభించినట్లు పేర్కొన్నారు. మృతుడు గీతకార్మికుడు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల అబ్జర్వర్‌గా రాజ్‌కుమార్
కరీంనగర్‌స్పోర్ట్స్: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జరుగుతున్న 70వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్–14 బాలబాలికల వాలీబాల్ పోటీలకు కరీంనగర్ జిల్లా జెడ్పీహెచ్‌ఎస్ కేశవపట్నం పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ భక్తు రాజ్‌కుమార్ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఉషారాణి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎల్.బన్సీలాల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, పేటా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, అడేపు శ్రీనివాస్, అంతటి శంకరయ్య, చిరుత శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
రాజన్నకు ‘నీలకంఠ శతకం’ సమర్పణ
వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రాళ్లరామన్నపేటకు చెందిన సింగిరెడ్డి రాజిరెడ్డి గతంలో ‘సింగిరెడ్డి శతకం’, ‘రామ శతకం’ రచించారు. తాజాగా సమాజంలోని వాస్తవాలను కళ్లకు కడుతూ స్వామివారికి తన అంతరంగాన్ని విన్నవించుకునే రీతిలో తన మూడో రచన ‘నీలకంఠ శతకం’ పూర్తి చేసి శుక్రవారం ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితులు రాజిరెడ్డికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, డీఈ రఘునందన్ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవల్లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్
కరీంనగర్: ఖాతాదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలందించేందుకు భారత తపాలా శాఖ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ) సేవల్లో నూతన సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.సైదిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఆధునికీకరణలో భాగంగా ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలు కొన్ని రోజులపాటు తాత్కాలికంగా నిలిపేయనున్నట్లు వివరించారు. నవంబర్ నెలకు సంబంధించిన బీమా ప్రీమియం ఈనెల 15 లోగా చెల్లించుకోవాలని ఖాతాదారులకు సూచించారు. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ కారణంగా నవంబర్ 16 నుంచి 24 వరకు ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలు నిలుస్తాయన్నారు. నవంబర్ 25 నుంచి అప్‌గ్రేడ్ చేసిన నూతన సాఫ్ట్‌వేర్ ద్వారా సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయని, అప్పటి నుంచి ఖాతాదారులు యధావిధిగా ప్రీమియం చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.


