పాత రుణానికి ఏడాది విరామం! | - | Sakshi
Sakshi News home page

పాత రుణానికి ఏడాది విరామం!

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

కరువు మండలాల రైతులకు రుణ మారిటోరియం

ఏడాది పాటు చెల్లింపుల నుంచి ఊరట..

పాత రుణం రీషెడ్యూల్‌తో పాటు కొత్త పంట రుణాలు

జగిత్యాల జిల్లాలో 10–12 వేల మంది రైతులకు ప్రయోజనం

జగిత్యాల అగ్రికల్చర్‌: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిన ప్రాంతాల్లోని రైతులకు రుణ ఊరట కల్పించింది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల అర్బన్‌, జగిత్యాల రూరల్‌, కొడిమ్యాల మండలాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మండలాల్లో బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు ఏడాది పాటు రుణ చెల్లింపుల నుంచి మారిటోరియం వెసులుబాటు కల్పించనున్నారు. దీంతో మిగతా మండలాల రైతులతో పోలిస్తే ఈ మూడు మండలాల రైతులకు ప్రత్యేక ప్రయోజనం చేకూరనుంది.

రుణ మారిటోరియం అంటే..

మారిటోరియం అంటే రుణమాఫీ కాదు. పంట రుణం తీసుకున్న రైతులు ఏడాది పాటు వాయిదా లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అనంతరం రుణాన్ని రీషెడ్యూల్‌ చేసి రెండేళ్లలోపు చెల్లించే అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో బ్యాంకులు రుణ వసూలు కోసం ఒత్తిడి చేయడం, నోటీసులు జారీ చేయడం ఉండదు. అయితే రుణంపై వడ్డీ మాఫీ కాదు. ఆ వడ్డీని రైతులు చెల్లించాలా? ప్రభుత్వమే భరిస్తుందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అక్టోబర్‌ 24, 2026 వరకు కరువు మండలాల్లో తీసుకున్న పంట రుణాలకే ఈ వెసులుబాటు వర్తించనుంది. కౌలు రైతులకు మాత్రం ఈ ప్రయోజనం వర్తించదు.

10–12 వేల మంది రైతులకు లబ్ధి

జగిత్యాల జిల్లాలో 128 బ్యాంకు శాఖల ద్వారా 1.43 లక్షల మంది రైతులు సుమారు రూ.2 వేల కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. అయితే మారిటోరియం అందరికీ వర్తించదు. కేవలం మూడు కరువు మండలాల్లో రుణాలు తీసుకున్న 10–12 వేల మంది రైతులకు రూ.350–450 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. మండలాల వారీగా రైతుల సంఖ్య, రుణాల వివరాలపై ఈ నెల 18న కలెక్టర్‌ సత్యప్రసాద్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రాంకుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రైతులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంకులే రుణాలను రీషెడ్యూల్‌ చేస్తాయి. యాసంగి సీజన్‌కు పాత రుణం చెల్లించకుండానే కొత్త పంట రుణం పొందే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. అయితే కటాఫ్‌ తేదీ తర్వాత తీసుకున్న రుణాలకు మారిటోరియం వర్తించదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement