రైతుకు మేలు.. సంస్థకు వృద్ధి | - | Sakshi
Sakshi News home page

రైతుకు మేలు.. సంస్థకు వృద్ధి

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

● రైతు ఉత్పత్తి సంస్థలుగా పీఏసీఎస్‌లు ● ఒక్కో సంస్థలో 750 మంది సభ్యులు ● నాబార్డు ద్వారా రుణసౌకర్యం

పెద్దపల్లిరూరల్‌: రైతులకు సకాలంలో రుణాలు అందిస్తూ అండగా నిలుస్తున్న వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సహకార సంఘం ద్వారా ఫార్మర్‌ ప్రొక్యూర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీవో) ఏర్పాటు చేసి ఆ సంస్థకు రూ.2కోట్ల వరకు నాబార్డు రుణం అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఆ సొమ్ముతో రైతాంగానికి అవసరమయ్యే పురుగుమందుల దుకాణాలు, కోల్డ్‌ స్టోరేజీలు, మీట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, మినీ రైస్‌మిల్లులు లాంటి పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ప్రతీ సొసైటీలో 750మంది సభ్యులు

ఒక్కో సొసైటీలో 750 మంది సభ్యులను చేర్పించి, ఒక్కో సభ్యుడి నుంచి రూ.2 వేలు సభ్యత్వ రుసుంగా రూ.15లక్షలు వసూలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దానికి సమానంగా మరో రూ.15లక్షలు రాయితీ అందిస్తుంది. అలాగే యూనిట్‌ స్థాపనకు నాబార్డు నుంచి రుణసాయం అందించడంలోనూ సంపూర్ణ సహకారం అందిస్తుందని అధికారులు తెలిపారు.

మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించేందుకు..

సహకార సంఘాలు ఇప్పటికే రైతులకు అవసరమైన పెట్టుబడులకు రుణాలు అందించడంతోపాటు సూపర్‌మార్కెట్లు, ఎరువులు, విత్తనాలు అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. అయితే రైతు ఉత్పత్తి సంఘంగా ఏర్పాటు చేస్తే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను నేరుగా కంపెనీ నుంచే కొనుగోలు చేసి మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించేందుకు అవకాశముంటుందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతాయని పేర్కొన్నారు. అలాగే రైతులు పండించిన దిగుబడులను సంస్థ సభ్యులే కొనుగోలు చేసి వాటిని తమ అధీనంలో ఉన్న ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా మార్కెటింగ్‌ చేసే అవకాశముంటుందని, దీంతో సంస్థ ఆర్థికంగా వృద్ధి చెందుతుందని వివరించారు.

జిల్లాలో ఎంపికై న సొసైటీలు ఇవే..

జిల్లాలోని 9 సహకార సంఘాలను రైతు ఉత్పత్తి సంస్థలుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పెద్దపల్లి, ధూళికట్ట, సుల్తానాబాద్‌, జూలపల్లి, ముత్తారం, కాల్వశ్రీరాంపూర్‌, మేడిపల్లి, నందిమేడారం, కమాన్‌పూర్‌ సహకార సంఘాలను ఎంపిక చేశారు. ఆయా సంఘాల ద్వారా రైతు ఉత్పత్తి సంఘం కోసం సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement