గోదావరిఖని: సీఎంపీఎఫ్ పనితీరుపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని టీబీజీకేఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తాలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ విరమణ చేసిన సింగరేణి కార్మికుల పింఛన్ చెల్లింపులు జాప్యం జరగడం క్షమించరాని నేరమన్నారు. ప్రతీనెల 1, 2వ తేదీల్లో రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో జమ కావలసిన పింఛన్ డబ్బులు నవంబర్లో ఇప్పటికీ జమకాలేదని, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. సీఎంపీఎఫ్ సిబ్బంది పనితీరుతో సింగరేణి ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు కలుగుతున్న అసౌకర్యానికి, నష్టానికి నిరసనగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఆయన హెచ్చరించారు. నాయకులు వడ్డేపల్లి శంకర్ రాజేశం, దూటా శేషగిరి, కొండ్ర అంజయ్య, దేవేందర్, ఉప్పులేటి తిరుపతి, రవీందర్, అప్సర్పాషా, మీసా రాజు, భాస్కర్ నరేశ్, దేవేందర్, ఆరిఫ్, సతీశ్ పాల్గొన్నారు.


