రామగిరి: గ్రామీణ విద్యార్థుల కలలకు భరోసా ఇస్తూ మంథని జేఎన్టీయూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం నగరాల వైపు చూడాల్సిన ఉండేది. ఇప్పుడు సొంత ప్రాంతంలోనే ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తూ, ప్రముఖ కంపెనీల్లో కొలువులు సాధించే అవకాశాలు చేరువ అవుతున్నాయి. తల్లిదండ్రుల ఆశలు, విద్యార్థుల కలలు, యువత భవిష్యత్తు.. ఇలా అనేక ఆశలకు మంథని జేఎన్టీయూ వేదికగా నిలుస్తోంది.
విద్యార్థులకు భరోసా
ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలనేది ప్రతీవిద్యార్థి కల. దానిని సాకారం చేసేలా జేఎన్టీయూ ప్లేస్‌మెంట్ కొనసాగిస్తోంది. గత 12 విద్యా సంవత్సరాల్లో 445 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 2013–14లో ఏడుగురితో ప్రారంభమైన ప్లేస్‌మెంట్ల ప్రస్థానం.. 2024–25 నాటికి 90 మందికి చేరింది. 2021–22లో ఏకంగా 132 మంది ఉద్యోగాలు పొందడం విశేషం. ఈ విజయాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతోపాటు తల్లిదండ్రుల్లో ఆశలు నింపుతున్నాయి.
మంత్రి ప్రోత్సాహంతో నైపుణ్య శిక్షణ
చదువుతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇందుకోసం జేఎన్టీయూ – టీసీఎస్ ఐవోఎన్ మధ్య శిక్షణ ఒప్పందం కుదిరింది. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూలకు అవసరమైన నైపుణ్యాలపై తర్ఫీదు ఇస్తున్నారు.
ఉద్యోగం.. కుటుంబానికి వెలుగు
విద్యార్థికి ఉద్యోగం రావడమంటే.. వ్యక్తిగత విజయమే కాదు.. ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కూడా. తల్లిదండ్రుల ఏళ్ల కష్టానికి ఫలితం. మరో విద్యార్థికి స్ఫూర్తి. అలాంటి విజయాలకు మంథని జేఎన్టీయూ వేదికగా నిలుస్తోంది.
చదువుతోపాటు ఉపాధి అవకాశాలు
ప్రత్యేక కార్యాచరణలో జేఎన్టీయూ
ఇప్పటికే 445 మందికి కొలువులు
జేఎన్టీయూలో ప్లేస్‌మెంట్లు
విద్యా సంవత్సరం – ఉద్యోగాలు
2013-14 - 7
2014-15 - 9
2015-16 - 15
2016-17 - 4
2017-18 - 15
2018-19 - 14
2019-20 - 24
2020-21 - 41
2021-22 - 132
2022-23 - 49
2023-24 - 45
2024-25 - 90


