రామగిరి: గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసి, వసతులు కల్పించి, ప్రజలకు మెరుగైన జీవన సదుపాయాలు కల్పించడమే వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ) లక్ష్య మని జెడ్పీ సీఈవో నరేందర్ అన్నారు. సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో వీబీజీపీపీపై శనివారం జిల్లాస్థాయి శిక్షణ, సమన్వ య సమావేశం నిర్వహించారు. గ్రామావసరాలను గుర్తించడం, ప్రాధాన్య పనులను ఎంపిక చేయడం, శాఖల వారీగా చేపట్టే పననులను అనుసంధానం చేయడం, అందుబాటులోని వనరులను సద్వినియోగం చేసుకోవడం, ప్రణాళిక అమలును పర్యవేక్షించడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. డీఆర్డీవో కాళిందిని, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ శ్రీనివాస్, అదనపు డీఆర్డీవో మల్లేశ్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సర్పంచులు, ఏపీఎంలు, ఏపీవోలు, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
గోదావరిఖని: పార్టీ బలోపేతమే లక్ష్యమని రా మగుండం కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఎండీ ముస్తాఫా అన్నారు. కార్పొరేషన్ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత తొలిసారి శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, మాజీ అధ్యక్షుడు బొంతల రాజేశ్‌తో కలిసి మాట్లాడారు. కష్టపడి పనిచేసే ప్రతీకార్యకర్తకు అండగా ఉంటూ పార్టీని బలంగా తయారు చేయడానికి అందరినీ కలుపుకొని పనిచేస్తానని ముస్తాఫా అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతూ అర్ములకు ప్రయోజనాలు అందేలా పనిచేద్దామని అన్నారు. త్వరలోనే కొత్త కమిటీలు నియమిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ పాత పెల్లి ఎల్లయ్య, నాయకులు తిప్పారపు శ్రీనివా స్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాల పనులు వేగవంతం చేయాలి
పెద్దపల్లి: గోదావరి పుష్కరాల పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ శ్రీరాములుతో కలిసి శనివారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. రోడ్ల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధి, భూసేకరణ, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని, గడువులోగా పనులు పూర్తిచేయాలని తెలిపారు. మంథనిలో పుష్కర ఘాట్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఇరిగేషన్, ఎండోమెంట్, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
పెద్దపల్లిరూరల్: పెద్దకల్వల, నిట్టూరు, నిమ్మనపల్లి గ్రామాలతో పాటు రంగంపల్లి– పెద్దపల్లిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఒకటిన మెగా జాబ్ మేళా
పెద్దపల్లి: జిల్లా ఉపాధి కల్పన, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఒకో తేదీన జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని టాస్క్ సెంటర్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎల్‌ఎన్ గ్రూప్‌లో అసెంబ్లీ ఆపరేటర్లు, రేడియంట్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్లు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో బ్యాంకింగ్ అసోసియేట్లు, డీ మార్ట్‌లో క్యాషియర్లు, ప్రమోటర్లు, నీమ్యాన్స్‌లో సేల్స్ ప్రమోటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. డేటా అనలిస్ట్ కోర్సులో ఉచిత శిక్షణతోపాటు ప్లేస్‌మెంట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైనవారు అర్హులని పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న వారికి నెలకు రూ.18 వేల నుంచి రూ.45 వేల వరకు వేతనం ఉంటుందని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు తగిన ధ్రువీకరణపత్రాలతో హాజరు కావాలని వారు కోరారు.


