పెద్దపల్లి: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు, ఉత్సవ కమిటీలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు సూచించారు. అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా వేడుకలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని శ్రీరాములు సూచించారు. వేడుకులు ప్రశాంతంగా జరిగే మండప నిర్వాహకులు అన్నివి ధాలా సహకరించాలని ఆయన కోరారు. స మావేశంలో ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, ఏ సీపీ కృష్ణ, కలెక్టరేట్ ఏవో ప్రకాశ్ పాల్గొన్నారు.
సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక
రామగుండం: అంతర్గాం మండలం పొట్యాల ప్రభుత్వ హైస్కూల్‌లోని ఎనిమిదో తరగతి విద్యార్థులు ఎం.ప్రహర్షిత్, జి.హర్షిత్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం.ముక్కెర సంగీత తెలిపారు. గోదావరిఖని లో జరిగిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ ఎంపిక పోటీల్లో వారు ప్రతిభ చూపారన్నారు. ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు బెల్లంపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటున్నారని పీడీ ఆర్.తిరుపతి తెలిపారు. సర్పంచ్ జాడి లోకేశ్, ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
జోన్‌స్థాయి క్రీడాపోటీలు
పెద్దపల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం జోన్‌స్థాయి ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు నిర్వహించారు. డీవైఎస్‌వో సురేశ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ మాట్లాడుతూ, పోటీల్లో ప్రతిభ చూపి సుత్తానాబాద్‌కు మంచిపేరు తీసుకు రావాలన్నారు. విజేతలకు బహుమతులు, పతకాలు అందజేశారు. కౌన్సిలర్లు గాజుల రాజమల్లు, వరప్రదీప్, ప్రతినిధులు దాసరి రమేశ్, తాండ్ర ప్రణయ్, ముస్త్యాల రవీందర్ పాల్గొన్నారు.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
పెద్దపల్లి: తమ సమస్యలు పరిష్కరించాలని, హక్కులు పరిరక్షించాలనే డిమాండ్‌తో వివిధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేశారు. దీంతొ జిల్లా కేంద్రంతోపాటు సుల్తానాబాద్‌లోనూ బ్యాంకింగ్ సేవలకు అంతరా యం ఏర్పడింది. ఈసందర్భంగా ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. వివిధ బ్యాంకుల ఉద్యో గులు, అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి
జ్యోతినగర్: ఎన్టీపీసీలో చేపట్టిన తెలంగాణ స్టేజ్–2 యూనిట్ యాష్ పాండ్ నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్టీపీసీ పీటీఎస్‌కు చేరుకున్న ఎంపీకి ఐఎన్‌టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా, నాయకుడు గుమ్మడి కుమారస్వామి స్వాగతం పలికారు. మొగల్‌పహాడ్, రాజాపూర్‌లోని దాదాపు 600 ఎకరాలు సేకరించే ముందే నిర్వాసితులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఎన్టీపీసీని సీ–గ్రేడ్ నుంచి బీ–గ్రేడ్‌గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు దళితుల వ్యతిరేక పార్టీలని విమర్శించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి కోసం కేంద్ర మంత్రులతో మాట్లాడామని గుర్తుచేశారు. రామగుండం విమానాశ్రయం కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని ఎంపీ అన్నారు.


