కోల్‌సిటీ: బుద్ధిమాంద్యం, మానసిక అభివృద్ధిలో వెనుకబడిన దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ సామర్థ్యాలను వెలికితీసేందుకు రామగుండంలో ‘భవిత’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మూడేళ్ల నుంచి 15 ఏళ్లలోపు వయసుగల దివ్యాంగ పిల్లలు మాత్రమే అర్హులని రామగుండం (అర్బన్) ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో అలేఖ్య పటేల్ తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, మానసిక, విద్యా వికాసానికి తోడ్పడటమే కేంద్రం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పిల్లల కోసం వివిధ రకాల ఆట వస్తువులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రత్యేక బీఎడ్ అర్హత కలిగిన ఇద్దరు ఇన్‌స్ట్రక్టర్ల ఆధ్వర్యంలో పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
భోజనం.. ఉచిత రవాణా
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నిర్వహించే ఈ భవిత కేంద్రానికి వచ్చే పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. అలాగే గోదావరిఖని నుంచి ‘భవిత’ కేంద్రానికి పిల్లలను తీసుకురావడానికి ఉచిత రవాణా సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని సీడీపీవో వివరించారు.


