ఆశలు కురిపిస్తున్న వానలు | - | Sakshi
Sakshi News home page

ఆశలు కురిపిస్తున్న వానలు

Aug 21 2026 9:56 AM | Updated on Aug 21 2026 9:56 AM

మంథని: ఎల్‌నినోతో వర్షాలు ముఖం చాటేశాయి. సాగుపై ఆశలు వదులుకున్న అన్నదాతకు కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు ఊపిరి పోస్తున్నాయి. వర్షాభావంతో పంటలు ప్రశ్నార్థకంగా మారుతాయేమోననే ఆందోళనలో ఉన్న రైతులపై వానదేవుడు కరుణ చూపడంతో పంటలు మళ్లీ పచ్చదనం సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మంథని డివిజన్‌ చివరి ఆయకట్టు, వర్షాధార పంటల పనులు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం పత్తి పంట ఆశాజనకంగా కనిపిస్తోంది.

చివరి ఆయకట్టుకూ సాగునీరు

వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నా రైతులు వెనుకడుగు వేయకుండా వరినాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నాట్లు పూర్తి కాగా, మరికొన్నిచోట్ల కొనసాగుతున్నాయి. కొద్దిరోజులుగా బోసిపోయి కనిపించిన పొలాలు క్రమంగా పచ్చని పైరుతో కళకళలాడుతున్నాయి. మంథని డివిజన్‌లోని కమాన్‌పూర్‌, ముత్తారం, రామగిరి, మంథని మండలాల్లో ఈ సీజన్‌లో ఏటా 25 వేల ఎకరాల్లో వరి నాట్లు వేస్తారు. ఈసారి కూడా ఇప్పటికే 22 వేల ఎకరాల్లో నాట్లు పూర్తయినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేవలం ఐదు శాతమే బీళ్లుగా ఉన్నాయి. ముందుగా సాగునీరు అందే పొలాల్లో ఇప్పటికే సాగు పనులు ప్రారంభించగా, చివరి ఆయకట్టు రైతులు వర్షాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. పత్తి పంటను 25 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు సమాచారం. ప్రస్తుత జల్లులతో పొలాల్లో తేమ పెరగడంతోపాటు, సాగునీటి లభ్యత పెరుగుతోంది.

పెట్టుబడులపై ఆశలు

విత్తనాలు, ఎరువులతోపాటు పెట్టుబడి పెట్టిన రైతులు మంచి దిగుబడి కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు సహకరిస్తే సాగు సజావుగా సాగుతుందని ఆశపడుతున్నారు. ఈమేరకు వ్యవసాయ శాఖ సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు. ఆలస్యమైనా సాగు మళ్లీ ఊపందుకోవడంతో అన్నదాత దిగుబడిపై ధీమాతో ఉన్నాడు.

రైతుల్లో ధైర్యం

సకాలంలో వర్షాలు కురకపోవడంతో విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు వెచ్చించినా పంట చేతికొస్తుందా? అనే సందేహం రైతుల్లో నెలకొంది. తాజాగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో కొంతవరకు నీరు చేరింది. బోరుబావుల ఆధారంగా వేసిన పంటలకు ఢోకా లేదు. సాగునీటి కాలువల ఆధారంగా వేసిన పంటలపైనే కాస్త ఆందోళన కనిపిస్తోంది. సకాలంలో వర్షాలు కురిస్తే దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణం వరి, పత్తి పంటలకు అనుకూలంగా మారుతుందని ఆశిస్తున్నారు.

ఎల్‌నినోతో నీరసించిన రైతుపై వానదేవుడి కరుణ

ఆలస్యమైనా ప్రస్తుతం ఊపందుకున్న వరినాట్లు

పత్తి పంటకు అనూకూలమైన తాజా వాతావరణ పరిస్థితులు

ఈసారి పంటలకు ఢోకా లేదంటున్న అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement