● పంపిణీకి అధికారుల కసరత్తు ● దరఖాస్తుదారుల్లో ఆశలు
పెద్దపల్లి: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దరకాస్తుదారులకు త్వరలోనే లబ్ధిచేకూరనుంది. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్చారణ రూపొందించింది. ఈనెల 15 నుంచి కొత్త పింఛన్‌దారులకు డబ్బులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క ఇటీవల ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
చిగురిస్తున్న ఆశలు
జిల్లాలో వేలాది మంది దరఖాస్తుదారులు పింఛన్ల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్నకొత్త లబ్ధిదారులతోపాటు కుటుంబ పరిస్థితుల్లో మార్పులు వచ్చిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ముఖ్యంగా పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణించినా అర్హత ఉన్నభార్యకు వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది.
సర్కారు నిర్ణయంతో హర్షం
మృతుల కుటుంబాలకు పింఛన్ మంజూరు చేయాలనే నిర్ణయం క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. పింఛన్ మార్పిడి కోసం దరఖాస్తు చేసి చాలామంది ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ధ్రువపత్రాలు సమర్పించినా మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతోందని దరఖాస్తుదా రులు వాపోతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇలాంటి వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. మన జిల్లాలోనే సుమారు 10 వేల మంది కొత్త లబ్ధిదారులు లేదా మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారని, వారికి లబ్ధిచేకూరుతుంని అధికార వర్గాల అంచనా.
ఇతరులపై ఆధారపడకుండా..
వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా ప్రభుత్వం ప్రతినెలా చేయూత పేరిట పింఛన్లు అందిస్తోంది. అయితే, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, గీత, చేనేత, బీడీ కార్మికులు, బోదకాలు, డయాలసిస్ పేషెంట్లు, ఒంటరి మహిళలు మూడేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఏళ్లకింద దరఖాస్తు చేసుకున్నారు. వీరు జిల్లా, మండల, గ్రామ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పటికీ పింఛన్లు మంజూరు కాక తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వీరందరూ సంతోషంతో ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో పింఛన్‌దారులు


