చిత్తశుద్ధితో పని చేయాలి
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే కృషి చేశారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని మహిళ ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉపాధ్యాయులను కలెక్టర్ సత్కరించారు. డీఈవో శారద, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


