పులి కోసం అన్వేషణ
పెద్దపల్లిరూరల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులను పెద్దపులి కలవరపెడుతోంది. పులి అడుగు జాడలు పెద్దపల్లి జిల్లా శివారులో కనిపించకపోయినా.. జిల్లా అటవీ అధికారులు కొద్దిరోజులుగా కంటిమీద కునుకు లేకుండా అడవులను జల్లెడ పడుతున్నారు. జూలపల్లి శివారు ప్రాంతంలో పులి అడుగు జాడలు ఉన్నట్టు తేలడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. కరీంనగర్ మండలం బహదూర్‌ఖాన్‌పేటకు చెందిన రైతుకు పులి కనిపించినట్టు ప్రచారం జరిగింది. అయితే జూలపల్లి శివారు నుంచి చొప్పదండి మీదుగా కరీంనగర్ ప్రాంతానికే పులి పయనమైనట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయినా ఎప్పుడు ఎటు వైపు వస్తుందోనని రైతులు, పశువులు, గొర్రెల కాపరులను అప్రమత్తం చేస్తున్నట్టు ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ మంగిలాల్ తెలిపారు.
రైతులు జాగ్రత్తగా ఉండాలి
జూలపల్లి: మండలంలో పెద్దపులి సంచారం ఉందని, పొలాల వద్దకు రాత్రి పూట వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. మండలంలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయ గుట్ట, అబ్బాపూర్ పోచమ్మ గుట్ట ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లు గుర్తించామని రైతులకు వివరించారు. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అటవీశాఖ అధికారులు వ్యవసాయ పనులకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పసునూటి శ్రీనివాస్, బొమ్మెనవేని కొమురయ్య తదితరులు ఉన్నారు.


