దశాబ్దాల కల.. నెరవేరిన వేళ
మంథనిరూరల్: ఎన్నో ఏళ్లుగా బురద, గుంతలు పడిన రోడ్డుపై ప్రయాణ కష్టాలు ఇక తీరనున్నాయి. మంథని మండలం ఖానాపూర్ వాసుల దశాబ్దాల కల నెరవెరబోతోంది. సింగిల్ రోడ్డుతో ఇన్నేళ్లు ఇబ్బందులు తొలగిపోతుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పీడబ్ల్యూడీ రోడ్ నుంచి ఎల్‌మడుగు వరకు వయా ఖానాపూర్ మీదుగా ప్రభుత్వం డబుల్ రోడ్డు మంజూరు చేసింది. ఇందుకు రూ.7కోట్ల సీఆర్‌ఆర్ నిధులు కేటాయించగా మూడునెలల క్రితమే పనులు ప్రారంభించారు.
దశాబ్దాలు గడిచినా..
చాలా ఏళ్లుగా ఖానాపూర్‌కు సింగిల్ రోడ్డు ఉండేది. ఎగ్లాస్‌పూర్ సమీపంలోని ప్రధాన రహదారి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉంటుంది. గడిచిన దశాబ్దకాలంలో ఒకట్రెండు సార్లు మాత్రమే బీటీ వేశారు. సింగిల్ రోడ్డు కావడంతో గ్రామస్తులు, వాహనదారులు ఇబ్బంది పడేవారు. రహదారిని బాగు చేయాలని పలుమార్లు తమ ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. కాగా, మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో ఖానాపూర్ గ్రామానికి డబుల్‌రోడ్డు మంజూరైందని గ్రామస్తులు చెబుతున్నారు. .
రైతులకు తీరనున్న కష్టాలు
గోదావరినది తీరం ఎల్‌మడుగు సమీపంలోనే ఖానాపూర్ వాసులకు పంటపొలాలు ఉండటంతో గతంలో రోడ్డు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడేవారు. కనీసం ద్విచక్రవాహనం వెళ్లేందుకు వీలు లేక పొలాల వద్దకు నడుచుకుంటూనే వెళ్లేవారు. కాగా, ఎల్ మడుగు వరకు డబుల్‌రోడ్డు నిర్మిస్తుండడంతో తమ కష్టాలు తీరుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖానాపూర్‌కు డబుల్ రోడ్డు నిర్మాణం
రూ.7కోట్ల నిధులు మంజూరు చేసిన సర్కార్
దశాబ్దాల కల.. నెరవేరిన వేళ


