
వరద.. వణుకు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరి బ్యాక్ వాటర్ అంటేనే.. లోతట్టు ప్రాంతప్రజలు భయంతో వణికి పోతున్నారు. మూడేళ్లక్రితం కురిసిన భారీవర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటికీ ఆ దృశ్యాలు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. తాజాగా కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు గురువారం ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి దిగువన ఉన్న గోదావరి నదిలోకి 8.20లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం వరకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రం మళ్లీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో మళ్లీ 40 గేట్ల ద్వారా 7.45 లక్షలను గోదావరి నదిలోకి విడుదల చేశామని అధికారులు తెలిపారు. వరద ఉధృతితో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.
● వెంటాడుతున్న చేదుజ్ఞాపకం..
మూడేళ్ల క్రితం కురిసిన భారీవర్షాలతో రామగుండం నగరంలోని లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అప్పుడు దిగువన నిర్మించిన పార్వతీ బ్యారేజ్ గేట్లు మూసి ఉంచడంతో గోదావరి నదికి వరద పోటెత్తింది. బ్యాక్‌వాటర్‌లో గంగానగర్‌లోని రఘుపతిరావునగర్, మల్కాపూర్, రెడ్డికాలనీ, సప్తగిరికాలనీ, రాజలక్ష్మీ కాలనీతోపాటు మేడిపల్లిలోని చాలాకుటుంబాలు వరదలో చిక్కుకున్నాయి. పడవల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.
● నిత్యావసరాలకూ అవస్థలు..
ఇళ్లలోకి వరద వచ్చి చేరడంతో నిత్యావసరాలు, విలువైన వస్తు, సామగ్రి తడిసి ముద్దయ్యాయి. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సమీపంలోని గురుకుల విద్యార్థులను షెల్టర్లకు తరలించారు. విద్యార్థుల సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, పుస్తకాలు నీళ్లల్లో తడిసిముద్దయ్యాయి. తాజాగా మల్కాపూర్ శివారులోని పొలాలు నీటమునిగాయి. రావూస్ పాఠశాల సమీపంలోని రహదారి వరకు వరద వచ్చి చేరింది. గంగానగర్‌లోని లారీ యార్డ్‌లోకి కూడా వరద రావడంతో లారీలను రోడ్డుపై పార్కింగ్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పర్యటించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
● కొలిక్కిరాని గోదావరి తీరంపై కరకట్ట..
గోదావరి తీరం వెంట సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున కరకట్ట నిర్మించాల్సిన ప్రతిపాదనల అడుగు ముందుకు పడడం లేదు. కరకట్ట నిర్మిస్తే బ్యాక్ వాటర్ ముంపు తప్పుతుందని పలువురు వెల్లడిస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 9 లక్షలకుపైగా క్యూసెక్కుల వరద దిగువకు వదిలితే.. లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుందని అంచనాకు వస్తున్నారు.

వరద.. వణుకు

వరద.. వణుకు