
ఆకస్మిక పర్యటన .. అనేక అంశాలు
గోదావరిఖని: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువా రం సాయంత్రం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టును ఆకస్మికంగా సందర్శించడం ఆద్యంతం ఆసక్తి రేపింది. భారీవర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం రాక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు.. వరదల ఉధృతిని తట్టుకుని అత్యంత పటిష్టంగా, మన్నికగా ఉందనే విషయాన్ని ఆయన రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పినట్లయ్యింది. రూ.వేల కోట్లు వెచ్చించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు నాణ్యతా లోపంతో పనికి రాకుండా పోయాయనే సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.
ఆసక్తి రేపిన ప్రసంగం..
తాము వేల పుస్తకాలు చదవలేదని, ప్రాక్టికల్‌గా పరిశీలించి ప్రాజెక్టు పరిస్థితి తెలుసుకుంటున్నామ ని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. సుమారు అర్ధగంట పాటు ప్రాజెక్టును పరిశీలించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, ప్రాజెక్టు నిపుణులతో చాలాసేపు మాట్లాడా రు. వరద ఉధృతి, దానిద్వారా తలెత్తే అవరోధాలు, సమస్యలను ఎదుర్కొనే విధానాలపై ఇంజినీర్లతో చర్చించి పలు సూచనలూ చేశారు.
‘ఎల్లంపల్లి’ రాష్ట్రానికే గుండెకాయ..
ప్రజావసరాలు తీర్చుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు రా ష్ట్రానికి గుండెకాయ అని సీఎం గుర్తుచేయడం ద్వా రా ప్రాజెక్టు ప్రాధాన్యత మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా గోలివాడ పంప్‌హౌస్ వద్దకు చేరుకున్న సీఎం.. తొలుత గోదావరి వరద పరిస్థితిపైని హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. ఆ తర్వాత హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం.. ముఖ్యకార్యకర్తల వద్దకు వెళ్లారు. వారితో కరచాలనం చేసి ఉత్సాహం నింపారు.
బీఆర్‌ఎస్ దూకుడుకు అడ్డుకట్ట..
భారీవర్షాలు, వరదల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రాజెక్టుల నిర్మాణం గురించి రేవంత్‌రెడ్డి దిశాదినిర్దేశం చేసినట్లయ్యింది. అయితే, రాష్ట్రస్థాయి నాయకులు, ముఖ్యశ్రేణులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తు న్న నేపథ్యంలో సీఎం ఆకస్మాత్తుగా వరద ప్రాంతా ల్లో పర్యటించడం వెనుక బీఆర్‌ఎస్ దూకుడుకు అ డ్డుకట్ట వేసేందుకేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నా రు. ప్రతిపక్ష పార్టీకన్నా ముందే బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడం, అధికారులను అ ప్రమత్తం చేయడం, వరదల ఉధృతి పెరిగితే.. తలెత్తే పరిణామాలను అంచనా వేయడానికి సీఎం ఆకస్మిక పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం..
సీఎం రేవంత్‌రెడ్డి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు సందర్శన జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. తొలుత సీఎం పర్యటన రద్దయ్యిందని ఎమ్మెల్యేకు సమాచారం అందించిన అధికారులు.. మళ్లీ పర్యటన ఖరారు చేస్తూ టూర్‌షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా గోలివాడ పంప్‌హౌస్ వద్దకు ఆగమేఘాలపై చేరుకున్నారు. సీఎం ఆకస్మిక పర్యటన కావడంతో ఎక్కువ మంది కాంగ్రెస్ శ్రేణులు హాజరుకాకపోయినా.. భారీవర్షాల నేపథ్యంలో తొలిసారి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సీఎం రావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.