
ఆధునికం.. ఆహ్లాదం
డిజిటల్ విద్యాబోధన ఆకట్టుకునే తరగతి గదులు పచ్చని చెట్లు.. అందమైన బొమ్మలు ఆదర్శంగా న్యూమారేడుపాక ప్రభుత్వ పాఠశాల
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): అది సింగరే ణి ప్రభావిత గ్రామం.. రామగుండం కార్పొరేషన్ 19వ డివిజన్ పరిధిలోని న్యూమారేడుపాక(నర్సింహపురం) జెడ్పీ హైస్కూల్ అక్కడి ప్రత్యేకత. స్కూల్ తరగతి గదులను ఆధునికీకరించారు. డిజిటల్ పద్ధతిన విద్యాబోధన చేస్తున్నారు. అంతేకాదు.. పాఠాలు సులభంగా అర్థమయ్యేందుకు, విద్యార్థులు శ్రద్ధతో వినేందుకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు.
రూ.9 లక్షలు కేటాయించడంతో..
తరగతి గదులు, మూత్రశాలలు, వంటగదులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈవిషయాన్ని ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ.. ఇటీవల ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే.. సింగరేణి ఆర్జీ–2 యాజమాన్యంతో మాట్లాడి దాదాపు రూ.9లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులు వెచ్చించి ప్రహరీ, బడి వరకు సీసీ రోడ్డు, వంటగది నిర్మించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు క్లాస్‌రూమ్‌లను డిజిటల్ బోధనకు అనుకూలంగా తీర్చిదిద్దారు. స్టేజీ నిర్మాంచారు. బాలుర కోసం ప్రత్యేకంగా మూత్రశాలలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
రోజూ ప్రత్యేక తరగతులు..
పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యు త్తమ మార్కులు సాధించేలా రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తర గతులు నిర్వహిస్తున్నా రు. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో గ తేడాది టెన్త్‌లో 97శాతం ఉత్తీర్ణత సాధించి మండలంలోనే పాఠశాల అగ్రస్థానంలో నిలించింది. 98 మంది విద్యార్థులు ఉండగా.. ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాట, టెన్త్ ఫలితాల ప్రచారంతో 30 మంది విద్యార్థులను కొత్తగా బడిలో చేర్పించారు.
అందంగా చెట్లు..
పాఠశాల ఆవరణలోని మొక్కలు, చెట్లకు గణిత ఉపాధ్యాయురాలు పద్మ కుమారి సహకారంతో విద్యార్థులు రంగులు వేశారు. అందంగా తీర్చిదిద్దారు. వాటిద్వారా కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు.

ఆధునికం.. ఆహ్లాదం