
సున్నిత ప్రాంతాలపై డేగకన్ను
గోదావరిఖని: గణపతి నవరాత్రి ఉత్సవాలు
భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా.. అసాంఘిక శక్తుల ఆకట్టించేలా.. రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసు యంత్రాంగం డేగకళ్లతో నిఘా ఉంచుతుందని సీపీ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు వైరల్ చేసినా, మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరించినా సహించేది లేదన్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన
పలు విషయాలు వెల్లడించారు.
ప్రతీరోజు వారుచేసే పనులు ఏమిటి?
సీపీ : ప్రతీరోజు గణేశ్ మండపాలను తనిఖీ చేస్తారు. ఫైర్‌సేఫ్టీ, ఎలక్ట్రిసిటీ, బారికేడ్ల పరిశీలన, పాయింట్ బుక్స్ చెకింగ్, సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా సరిగ్గా సాగేలా పర్యవేక్షిస్తారు. ఫిర్యాదులు స్వీరించి పరిష్కరిస్తారు.
బలవంతపు చందాలపై ఫిర్యాదులు వచ్చాయా?
సీపీ : ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. పోలీసు పహారా, ఇంటలిజెన్స్ సిబ్బంది ద్వారా నిరంత రం పర్యవేక్షణ కొనసాగుతోంది. బలవంతపు చందాలపై ఫిర్యాదులు వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
గతేడాది తీసుకున్న చర్యలు? నిందితుల వివరాలు?
సీపీ : గతేడాది దాదాపుగా ఏడు సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగిన సంఘటనలపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అప్పటి నిందితులపై ఈసారి గట్టి నిఘా ఏర్పాటు చేశాం.
అక్కడ గతంలో చోటుచేసుకున్న ఘటనలు, తీసుకున్న నియంత్రణ చర్యలేమిటి?
సీపీ : గతంలో జరిగిన ఘటనలపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. మళ్లీ అలాంటి సంఘటనలకు తావులేకుండా ఈసారి సీసీ టీవీలు, కెమెరాలు, బారికేడ్లు ఏ ర్పాటు చేస్తున్నాం. అదనపు సిబ్బంది తో ప్రత్యేక పెట్రోలింగ్ చేస్తున్నాం.
నవరాత్రి ఉత్సవాలు సాఫీగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
సీపీ : ఎవరికీ ఇబ్బంది లేకుండా గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించాలి. వాటి పర్యవేక్షణ కోసం బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్, విజిబుల్ పోలీసింగ్ ని ఘా నిరంతరం కొనసాగుతుంది. ఇందుకోసం ప్రతీ విగ్రహం వద్ద పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తాం.
జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయా?
సీపీ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని, మంథని, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాలను సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాం.
మండపాల పర్యవేక్షణకు సిబ్బందిని నియమించారా?
సీపీ: రామగుండం కమిషనరేట్ పరిధిలో మండపాల పర్యవేక్షణకు పోలీస్ సిబ్బందిని నియమించాం. వీరు నిరంతరం విధుల్లో ఉంటారు. ఇందులో ఒక ఎస్సైస్థాయి అధికారి, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ సిబ్బంది ఉంటారు.
నవరాత్రులు ముగిసే వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయా?
సీపీ : ఈనెల 27 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
నిబంధనలు అతిక్రమించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?
సీపీ : నిబంధనలు అతిక్రమించే వారిని బైండోవర్ చేస్తాం. జరిమానా విధిస్తాం. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం.

సున్నిత ప్రాంతాలపై డేగకన్ను