
సాంకేతిక కోర్సులతో ఉపాధి
కోల్‌సిటీ(రామగుండం): ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు పుష్కలంగా లభించే సాంకేతిక కోర్సులను ఉచితంగా అందిస్తున్న రామగుండం అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ సెంటర్‌లో విద్యార్థులు చేరేలా ప్రోత్సహించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ కోరారు. బల్దియా కా ర్యాలయంలో మంగళవారం వయోజన విద్య, మెప్మా ఆధ్వర్యంలో నవభారత్ సాక్షరతా కార్యక్రమం – ఉల్లాస్‌లో భాగంగా మండల స్థాయి, అ డ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ సెంటర్ కోర్సులపై అవగా హన కల్పించారు. ఐటీఐలను ప్రభుత్వం ఆధునికీకరించి డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెడుతోందన్నారు. ఐటీఐ ప్రిన్సిపాల్ సురేందర్ మా ట్లాడుతూ, ఐటీఐలో చేరేందుకు ఈ నెలాఖరు లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ, అసంఘటిత రంగ కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకుని ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలన్నారు. అనంతరం వయోజన విద్య రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఐటీఐ శిక్షణాధికారి విద్యాసాగర్‌రెడ్డి, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.