
వరదలతో దెబ్బతిన్న రోడ్లు, చెరువులను పునరుద్ధరించాలి
అందుకోసం వెంటనే అంచనాలు తయారు చేయండి
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించండి
అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
మెదక్, కామారెడ్డి జిల్లాల వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
వరదలపై హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్/పెద్దపల్లి/మెదక్‌జోన్: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణ మే అంచనాలు తయారు చేసి అత్యవసర నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.
భారీ వర్షాలతో బుధ, గురువారాల్లో పోటెత్తిన వరదలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని సీఎంకు రెండు జిల్లాల కలెక్టర్లు నివేదించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద హెలికాప్టర్ దిగి వరదల పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులను ఏరియల్ సర్వే నిర్వహించారు. కామారెడ్డిలో హెలికాప్టర్ దిగి జిల్లా కలెక్టర్‌తో సమీక్షించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవటంతో సాధ్యం కాలేదు. దీంతో మెదక్ జిల్లా చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హెలికాప్టర్‌ను మెదక్ ఎస్పీ కార్యాలయంలో దించి జిల్లాలో వరదల పరిస్థితిపై అక్కడే సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో వరద పరిస్థితిని కలెక్టర్ సీఎంకు నివేదించారు. వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పని చేసిందని సీఎం కితాబిచ్చారు. సమీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్ నుంచే సీఎం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వరద పరిస్థితులపై ఆరా తీశారు. సత్వరం సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద నష్టంపై అత్యవసరంగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవా లని సీఎం ఆదేశించారు. గురువారం ఉదయం తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్కతో కలిసి వరద పరిస్థితిపై సమీక్షించారు. హైదరాబాద్ నగరంతోపాటు అన్నిచోట్లా శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
వినాయక మండపాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆస్పత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతోపాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌బృందాల సాయం తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు.
మామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యం
మామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యంలా రూ.లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని, ఏనాడో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రస్తుతం తెలంగాణకు వరప్రదాయినిగా మారిందని అన్నారు.
మామ, అల్లుడు కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్నారని, వాళ్లలా తాము 80 వేల పుస్తకాలు చదవలేదని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై సెటైర్ వేశారు. యూరియాపై ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ డిస్‌ప్లే చేస్తున్నామని సీఎం తెలిపారు. తదుపరి పంటలకు సైతం కొందరు రైతులు యూరియాను నిల్వ చేసుకోవడంతో కొరత ఏర్పడిందని చెప్పారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఉన్నారు.