
నిత్యాన్నదాన సత్రానికి అడుగులు
● నేడు పనుల ప్రారంభోత్సవం ● హాజరు కానున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ● రాజన్న భక్తుల కోసం రూ.40 కోట్లతో ఏర్పాటు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
రాజన్న ఆలయ సమీపంలో ప్రభుత్వం తలపెట్టిన విస్తరణ, అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరహాలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీపంలో నిర్మించనున్న నిత్యాన్నదాన సత్రం పనులు ఆదివారం ప్రారంభం కానున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనులను ప్రారంభించనున్నారు. గంగాధరలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ‘జనహిత’ పాదయాత్రకు ముందే మంత్రులు వేములవాడలో నిత్యాన్నదానం పనులను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. దాదాపు రూ.40కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ప్లాన్, డిజైన్లను ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఖరారు చేసింది. ఈ పనులతోపాటు వేములవాడలో పలు రోడ్ల విస్తరణ పనులు ఆదివారం నుంచి పునఃప్రారంభం కానుండగా, తిప్పాపూర్ వద్ద అదనపు పనులు కూడా వేగం పంజుకోనున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రెండెకరాల సువిశాల స్థలంలో దాదాపు రూ.40 కోట్లతో పనులు చేపట్టనున్నారు. మొత్తం రెండంతస్తుల్లో నిర్మించనున్న ఈ భవనంలో తొలి అంతస్తులో ఒకేసారి 1,500 మంది భక్తులు భోజనం చేసేలా సదుపాయాలు కల్పిస్తున్నారు. రోజుకు 15,000 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. భవిష్యత్తులో భక్తుల రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా రెండో అంతస్తును కూడా వినియోగంలోకి తీసుకువస్తారు. అప్పుడు రోజుకు 30వేల మంది భక్తులు భోజనం చేసే వీలుంటుందని అధికారులు తెలిపారు.
కిలోమీటరు వరకు
విస్తరణ షురూ..
వేములవాడలోని తిప్పాపూర్ వంతెన నుంచి రాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్దకు దాదాపు 1.1 కిమీ దూరం వరకు తలపెట్టిన రోడ్డు విస్తరణ పనులు పునః ప్రారంభం కానున్నాయి. గతంలో పలు న్యాయ వివాదాలు ఎదురైనప్పటికీ.. వాటిని విజయవంతంగా ఎదుర్కొన్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా.. విస్తరణ పనులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా మాస్టర్‌ప్లాన్‌లో రాజీపడకుండా.. రోడ్డు విస్తరణ పనులను తిరిగి ప్రారంభించనున్నారు. తిప్పాపూర్ వద్ద రూ.15 కోట్లతో అదనపు వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే టెండర్లు పూర్తయిన ఈ పనులను కాంట్రాక్టర్ ఇప్పటికే ప్రారంభించారు. ప్రస్తుతం మట్టి తవ్వకాలు నడుస్తున్నాయి. గతేడాది నవంబరులోనే వేములవాడ ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.