
గతం కన్నా ఘనంగా గణపతి ఉత్సవాలు
అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు సెప్టెంబర్ 5న నిమజ్జన వేడుకలు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పలు సంస్థల అధికారులతో సన్నాహక సమావేశం
కోల్‌సిటీ(రామగుండం): గణేశ్ ఉత్సవాలు గతంకన్నా అత్యంత వైభవంగా జరుపుకుందామని, ఇందుకోసం వివిధ విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై బల్దియా కమిషనర్ అరుణశ్రీ అధ్యక్షతన శనివారం బల్దియాలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్పీడీసీఎల్, ఎల్, పోలీస్, అగ్నిమాపక తదితర విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్, అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా మండప నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవ కమిటీ సూచనల ప్రకారం ఒకేరోజు.. సెప్టెంబర్ 5న గణపతి విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పర్యావరణహిత మట్టి గణేశుని విగ్రహాలనే ప్రతిష్ఠించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మట్టివినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. అధికారులు రమేశ్, గంగాధర్, వెంకటయ్య, వరప్రసాద్, వీరారెడ్డి, వెంకటస్వామి, రామన్, నాయకులు మహంకాళి స్వామి, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. అనంతరం మూడు ఫాగింగ్ యంత్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.