
పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు
● సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు స్పందించవద్దు ● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
గోదావరిఖని: పండుగలు, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటూ మత సామరస్యానికి ప్రతీకలుగా నిలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. పోలీస్ కమిషనరేట్‌లో శనివారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, గతేడాది 4,786 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని, ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మండప నిర్వాహకులు తమ వివరాలతో పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించి అనుమతి తీసుకోవాలని సూచించారు. దీనిఆధారంగా ఆన్‌లైన్, జియోట్యాగింగ్ చేస్తామని అన్నారు. నిమజ్జనం సందర్భంగా అవాంతరాలు ఎదురవకుండా రూట్‌మ్యాప్ ఏర్పాటును పర్యవేక్షిస్తామని తెలిపారు. గణపతి మండపాల కమిటీ అధ్యక్షుడు ధృవీకరణపత్రాన్ని సమర్పించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లక్కీడ్రాలు ఏర్పాటు చేయొద్దని, జూదం ఆడరాదని, బలవంతపు చందాలు వసూలు చేయొద్దని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అసత్య ప్రచారాలు, పుకార్లు నమ్మవద్దన్నారు. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గణేశ్ నిమజ్జనంతోపాటు, మిలాద్ ఉన్ నబి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ సూచించారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, కరుణాకర్, ఏసీపీలు మల్లారెడ్డి, రమేశ్, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.