
రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
● ఎస్‌ఎఫ్‌ఐ నిరసన దీక్ష
పెద్దపల్లిరూరల్: విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ బాలికల విభాగం రాష్ట్ర కన్వీనర్ పూజ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సందీప్, ప్రశాంత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన నిరసనదీక్షలో నాయకులు కుమారస్వామి, జ్యోతి, అశోక్, రవీందర్, సాయిరాం ఆజాద్ తదితరులతో కలిసి ఆమె మాట్లాడారు. ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు వేధింపులకు గురిచేయకుండా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్‌కుమార్, అరవింద్, ఆదిత్య, రాజశేఖర్, ఐశ్వర్య, అక్షయ, శిరీష, అక్షిత, సాత్విక తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు మంథని, సుల్తానాబాద్ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి ఈనెల 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. పెద్దపల్లిలో గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, మంథనిలో గైనకాలజిస్ట్, సుల్తానాబాద్‌లో పిడియాట్రిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు బయోడేటాతో హాజరు కావాలని కోరారు. వివరాలకు 84990 61999, 94914 81481 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.