కోల్‌సిటీ(రామగుండం): ‘దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా...? ఒక్కసారి ఆక్యుప్రెషర్, సుజోక్, వైబ్రేషన్, మాగ్నేటిక్ థెరఫీ చికిత్స పొంది ఫలితం చూడండి. ఎలాంటి మందులు వాడనవసరం లేదు. ఇంజక్షన్లు అసలే లేవు. నొప్పి ఉండదు. చికిత్స ఉచితం’ అంటున్నారు రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ రాంమనోహర్ లోహియా ఆరోగ్య జీవన సంస్థాన సంస్థ ప్రతినిధులు. గోదావరిఖనిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక స్వతంత్రచౌక్‌లో ఉచిత చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
రాజస్థాన్ టు రామగుండం
రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘడ్ జంక్షన్‌లో ఉండే డాక్టర్ రాంమనోహర్ లోహియా ఆక్యుప్రెషర్ ఆరో గ్య జీవన సంస్థానం సంస్థ, దేశంలోని వివిధ రాష్ట్రా ల ప్రజలకు ఉచితంగా ప్రకృతి వైద్య చికిత్స అందించడానికి శ్రీకారం చుట్టింది. గోదావరిఖనిలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో కేవలం రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజుతో వారం రోజుల వరకు చికిత్సను అందిస్తున్నారు. రామగుండం లయన్స్ క్లబ్ సంస్థ ఈ ప్రకృతి వైద్య శిబిరానికి సహకారం అందిస్తోంది.
నాడీ వ్యవస్థపై ఒత్తిడి
శిబిరానికి వస్తున్న వారి వ్యాధులను ముందుగా థెరఫిస్టులు తెలుసుకుంటున్నారు. శరీరంలోని నాడీ వ్యవస్థలోని ముఖ్యమైన పాయింట్లను గుర్తిస్తూ వారి దగ్గరున్న వైబ్రేషన్, మ్యాగ్నెటిక్ పరికరాలతో ఒత్తిడి కలిగిస్తున్నారు. ఎలాంటి నొప్పి లేకుండా, మందులు వాడకుండా కేవలం నాడీ వ్యవస్థపై ఒత్తిడితో వ్యాధులు నయం అవుతాయనడంతో ఈ శిబిరానికి ఆదరణ పెరుగుతోంది.
అన్ని జబ్బులకు చికిత్స
ఆక్యుప్రెషర్, వైబ్రేషన్, సుజోక్, మ్యాగ్నెటిక్ చికిత్స విధానం ద్వారా శరీరంలోని అన్ని రకాల జబ్బులు నయం అవుతాయంటున్నారు రాజస్థాన్‌కు చెందిన అక్యుప్రెషర్ థెరఫిస్టులు. నడుం నొప్పి, ఎసిడిటీ, కీళ్ల నొప్పులు, అస్తమా, గుండెపోటు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, అధిక బరువు, తలనొప్పి, కంటి, చెవి, ముక్కు, మెడ నొప్పులు, నిద్రలేమి, మనశ్శాంతి లేకున్నా ఇలా అనేక సమస్యలకు ఆక్యుప్రెషర్ చికిత్స అందించవచ్చని చెబుతున్నారు.
ఆక్యుప్రెషర్‌తో దీర్ఘకాలిక వ్యాధులు నయం
నాడీ వ్యవస్థపై మ్యాగ్నటిక్ ఒత్తిడితో ఫలితం
రాజస్థాన్ నుంచి రామగుండం చేరిన థెరఫిస్టులు
శిబిరానికి తరలివస్తున్న నగర ప్రజలు