పరిహారంపైనే ఆశలు
● ‘అకాలం’తో 3,566 ఎకరాల్లో పంట నష్టం ● ప్రాథమిక సర్వే తర్వాత ప్రభుత్వానికి నివేదిక ● ప్రతిపాదనలు సరే.. పరిహారం ఏదంటున్న అన్నదాత
సాక్షి, పెద్దపల్లి: ప్రకృతి మిగుల్చుతున్న విషాదం అన్నదాతను అతలాకుతలం చేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందకుండానే పోతున్నాయి. ఈ సీజన్‌లో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాల్సిన పంటల బీమా పథకం ఊసేలేకపోవడంతో అన్నదాతకు పరిహారం రాని పరిస్థితి నెలకొనిఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మంజూరు చేసే పంట పరిహారంపైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు.
రూ.3.53 కోట్ల నష్టం..
గత మార్చిలో కురిసిన అకాల వర్షాలతో 505.23 ఎకరాల్లో వరి, 642 ఎకరాల్లో మొక్కజొన్నతోపాటు 1,359మంది రైతులకు చెందిన దాదాపు 1,175.16 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలతో 2,278.07 ఎకరాల్లో వరి, 113ఎకరాల్లో మామిడి.. మొత్తంగా 2,228 మంది రైతులకు చెందిన 2,391.07 ఎకరాల్లో పలు పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తంగా యాసంగి సీజన్‌లో 3,566.23 ఎకరాల్లో సుమారు రూ.3.53 కోట్ల విలువైన పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
పంటల బీమా లేదు
కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఫసల్ బీమా యోజన పథకం లోపభూయిష్టంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడం లేదు. ఈపథకంలో ఎకరాకి నిర్ణయించిన ప్రీమియంలో రైతులు 50శాతం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం 25శాతం, రాష్ట్ర ప్రభుత్వం మరో 25శాతం చెల్లించేది. ఈపథకం అమలులోలేక గతంలో పంటనష్టం వాటిల్లినా.. అన్నదాతకు పరిహారం అందలేదు. 2023లో యాసంగి సీజన్‌లో 6,910 ఎకరాల్లో ఒకసారి, రెండోసారి కురిసిన వర్షంతో 21,900 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దానికి సంబంధించి అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. పరిహారం మంజూరుపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఇప్పడైనా ప్రభుత్వం సర్వేలతో సరిపెట్టక పరిహారం అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇదే విషయమై డీఏవో ఆదిరెడ్డిని వివరణ కోరగా ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించి సర్వే చేసి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించామని, త్వరలో రైతుల ఖాతాల్లో పరిహారం సమ్ము జమఅవుతుందన్నారు.
పరిహారంపైనే ఆశలు


