ఊరిస్తున్న పదవులు
● హస్తం పార్టీలో సంస్థాగత సందడి ● మండల స్థాయి నుంచి డీసీసీ వరకు పదవుల నియామకానికి కసరత్తు ● డీసీసీపై పలువురు నేతల ఆసక్తి, జోరుగా ప్రయత్నాలు ● 2017 నుంచి పార్టీలో ఉన్నవారికే పదవులని స్పష్టత ● సీనియర్లుతో పాటు మహిళలు, యువతకు పెద్దపీట
సాక్షి, పెద్దపల్లి: కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీలో పదవుల పందేరానికి రంగం సిద్ధమవుతోంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకవెళ్లేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల జిల్లాకు పీసీసీ పరిశీలకులుగా అజ్మతుల్లా హుస్సేనీ, సంగీతం శ్రీనివాస్‌ను నియమించింది. వీరు ఈనెల 30వ తేదీ వరకు జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. మే 4 నుంచి 19 వరకు బ్లాక్, అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేశాలు, అదే నెల 13 నుంచి 20 వరకు మండలస్థాయి సమావేశాలు నిర్వహించేలా రూట్ మ్యాప్ ను ప్రకటించింది. ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఏఐసీసీ సభ్యులు, పీసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకుల విస్తృత అభిప్రాయాలను పరిశీలకులు సేకరించి జాబితాలను వడపోస్తారు. చివరికి పీసీ సీకి నివేదించనున్నారు. సామాజి క సమీకరణలు, నాయకుల సమర్థత, సీనియార్టీ, నియోజకవర్గాలు, ఆయా బ్లాక్, జిల్లాల్లో పరిస్థితులు, పార్టీ బలోపేతానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని పదవులను భర్తీ చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాలోని ముఖ్యనాయకులు పదవులు దక్కించుకునేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో సందడి మొదలైంది.
సీనియర్లకే ప్రాధాన్యం
2017 నుంచి పార్టీలో ఉన్నవారికే మండల, బ్లాక్, డీసీసీ పదవుల్లో అవకాశం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. డీసీసీలు, మండల, బ్లాక్ కమిటీలే ఇకపై పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తాయని, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఇప్పటికే సంకేతాలివ్వడంతో ఈ పదవులు దక్కించుకునేందుకు నేతల్లో పోటీ మొదలైంది. మండల అధ్యక్ష పదవికి ఐదుగురు, బ్లాక్, డీసీసీ అధ్యక్ష పదవులకు ముగ్గురు చొప్పున పేర్లను సూచించాలని నిర్ణయించారు. పదవుల్లో మహిళలతో పాటు యువతకు పెద్దపీట వేయనున్నారు.
డీసీసీ పీఠం పైనే ఆసక్తి
కాంగ్రెస్ పార్టీలో మండల, బ్లాక్, జిల్లా అధ్యక్ష పదవులపై నేతల్లో పోటాపోటీ నెలకొంది. అయితే ప్రధానంగా జిల్లా అధ్యక్ష పదవులు ఎవరికి దక్కుతాయనే ఆసక్తి క్యాడర్‌లో నెలకొంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్ పేర్కొనడంతో అందరి దృష్టి డీసీసీ కమిటీలపై పడింది. దీంతో కొందరు నేతలు తమ అనుచరులను డీసీసీ పీఠాలపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2017 నిబంధన కూడా మరికొందరికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. 2017 నిబంధనతో కొత్తగా పార్టీలో చేరిన వారి ఆశలు నెరవేరే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతుంది. మొత్తంగా కాంగ్రెస్ పదవుల పంపకాల్లో ఎవరికి ఏ పదవి దక్కుతుందో అనే ఉత్కంఠ క్యాడర్‌లో నెలకొంది.
నామినేటెడ్ మరింత ఆలస్యమే..
తాజాగా పార్టీ సంస్థాగత కమిటీల నియామకాల ఏర్పాటుకు సన్నాహాలు మొదలవడంతో మరికొంత కాలం నామినేటడ్ పదవుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న జిల్లా, నియోజకవర్గస్థాయి నాయకులకు పార్టీ డీసీసీ అధ్యక్షులుగా, ఇతర కీలక పదవులు అప్పగిస్తారనే చర్చ సైతం
జరుగుతోంది. దీంతో నామినేటెడ్ పదవుల ఆశావహుల్లో ఒకింత గందరగోళం నెలకొంది.


