‘సీబీఎస్‌ఈ’ విద్యా బోధనకు ఏర్పాట్లు
● నర్సరీ – ఎనిమిదో తరగతి వరకు బోధన ● ఆ తర్వాత ఉన్నత తరగతులకు విస్తరణకు చర్యలు ● తొలుత సెక్టార్ –3 పాఠశాలలో అమలు ● దశల వారీగా సంస్థ వ్యాప్తంగా అమలు ● కార్మిక, ఉద్యోగ కుటుంబాల హర్షం ● నేటినుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విద్యాబోధనకు అనుమతి మంజూరు కావడంతో ఈమేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలుత రామగుండం –2 ఏరియాలోని యైటింక్లయిన్‌కాలనీ సెక్టార్–3 సింగరేణి పాఠశాలను ఇందుకోసం ఎంపిక చేశారు. వచ్చే విద్యా సంవత్సరం(2025–26) నుంచి సీబీఎస్‌ఈ పద్ధతిన విద్యా బోధన చేసేందుకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందితోపాటు ఇతర సౌకర్యాలన్నీ కల్పించారు.
సింగరేణిలోనే తొలిసారి..
సింగరేణి చరిత్రలోనే తొలిసారి యైటింక్లయిన్‌కాలనీ సెక్టార్–3 పాఠశాలను ఎంపిక చేశారు. తొలుత నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువు చెబుతారు. ఇందుకోసం ఈనెల 21(సోమవారం) నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు సుందర్‌రావు వివరించారు. పాఠశాలలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులతోపాటు ఒక్కో తరగతికి 80 మంది చొప్పున మొత్తం వెయ్యి మందికిపైగా విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఉపాధ్యాయులు చదువు చెబుతారు. సింగరేణి కార్మికుల పిల్లలతో పాటు సింగరేణి ప్రభావిత గ్రామాల విద్యార్థులు ఇందులో చదువుకునేందుకు అర్హులని హెచ్‌ఎం వివరించారు. సింగరేణి సీఎండీ బలరాం ప్రత్యేక చొరవతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తక్కువ ఖర్చుతో సీబీఎస్‌ఈ విద్యను అందించడంపై కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


