సన్నరకం ధాన్యానికి ఎర్రరంగు దారం వాడాలి
పెద్దపల్లిరూరల్: యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని, సన్నరకం ధాన్యం బస్తాలను ఎర్రరంగు, దొడ్డురకం ధాన్యాన్ని పచ్చరంగు దారంతో సంచులు కుట్టేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశమై పలు సూచనలు చేశారు. తూకం యంత్రాలు, టార్పాలిన్, గన్నీసంచులు, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. సన్న, దొడ్డురకం ధాన్యాన్ని సులభంగా గుర్తించేలా సన్నరకం ధాన్యాన్ని ఎర్రరంగు దారంతో కుట్టించి ఎరుపు రంగుతో ముద్ర వేయించాలన్నారు. దొడ్డురకం ధాన్యాన్ని పచ్చరంగు దారంతో కుట్టేలా చూడాలన్నారు. హమాలీలు, కాంటాలు వేర్వేరుగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి కొనుగోలు చేయాలని, కేటాయించిన మిల్లులకే ధాన్యం తరలించాలని, అక్రమాలకు పాల్పడ్డట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


