చలి.. పులి | - | Sakshi
Sakshi News home page

చలి.. పులి

Dec 27 2025 6:59 AM | Updated on Dec 27 2025 6:59 AM

చలి.. పులి

చలి.. పులి

● పడిపోతున్న ఉష్ణోగ్రతలు ● వణుకుతున్న ప్రజలు ● ముసురుకుంటున్న వ్యాధులు ● ప్రతీ ఇంట్లో జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ● జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్య నిపుణులు

జ్యోతినగర్‌: జిల్లాలో చలిపులి వణికిస్తోంది. భానుడి భగభగలు మాయమై.. ఎముకలు కొరికే చలి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో పాటు జిల్లాలో సైతం చలి జ్వరాలు ఇంటింటినీ పలకరిస్తోంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పులతో వైరస్‌లు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా ప్రతీ ఇంటా జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల బాధితులు కనిపిస్తున్నారు. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఉష్ణ నియంత్రణ వ్యవస్థపై ఒత్తిడి

సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రతను మెదడులోని హైపోథాలమస్‌ గ్రంథి నియంత్రిస్తుంది. అయితే బయట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతే శరీరంలోని ఉష్ణ నియంత్రణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 5 నుంచి 13 డిగ్రీల మధ్యే రికార్డవుతుండటంతో బాడీ మెకానిజం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి బీపీ పెరగడం, తద్వారా గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోతే, అది హైపోథెర్మియా వంటి ప్రాణాంతక స్థితికి దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజంతా గోరువెచ్చని నీటినే తాగాలని, ఇది గొంతు సమస్యలను దూరం చేయడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుందని చెబుతున్నారు.

జాగ్రత్తలు పాటించాలి

బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్వెట్టర్లు, మఫ్లర్లు, గ్లౌజులు తప్పనిసరిగా ఉపయోగించాలని, ముఖ్యంగా ముక్కు, చెవుల ద్వారా చలి గాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. శ్వాసకోశ సమస్యలున్న వారు రోజుకు రెండుసార్లు ఆవిరి పడితే ఊపిరితిత్తులకు ఉపశమనం లభిస్తుందని తెలుపుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి తాజా ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వద్ధులు, చిన్నారులు, ఆస్తమా రోగులు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, తెల్లవారుజామున, అర్థరాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవడం ఉత్తమమని, చలి తీవ్రత పెరిగే కొద్దీ బ్యాక్టీరియా విజృంభణ కూడా పెరుగుతుంది కాబట్టి స్వల్ప లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement