మీ పైసలు తీస్కోండి..!
‘ఎన్నికల్లో గెలవాలని అందిన కాడికాల్లా అప్పు తెచ్చి పంచిన.. గుంపగుత్తగా ఓట్లు రాబట్టేందుకు కులసంఘాలకు ఇంత చొప్పున ఇచ్చా.. అయినా గెలవలేదు. సరికదా పోటీ ఇచ్చే స్థాయిలో ఓట్లూ రాలేదు. మీ సంఘం కోసం ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వండి.. అంటూ జిల్లాలో పలువురు ఓడిన సర్పంచ్ అభ్యర్థులు వేడుకుంటుండగా, మరికొన్ని చోట్ల ఓడిన అభ్యర్థుల తిట్లు, శాపనార్థాలు తట్టుకోలేక ఓటర్లే తమకు ఇచ్చిన పైసలను అభ్యర్థులకు వాపస్ ఇచ్చిపోతున్నారు. ఇలా జిల్లాలో పలు గ్రామాల్లో ఎన్నికల తర్వాత పైసలు వాపస్ ఇవ్వాలంటూ కొత్తపంచాయితీలు మొదలయ్యాయి.’’
సాక్షి పెద్దపల్లి:
గ్రామపంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో కొత్త తలనొప్పులను తీసుకొచ్చాయి. భారీగా ఖర్చు పెట్టి మందు, పైసలు పంచి సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థుల బాధలు, ఏడుపులు, శాపనార్థాలతో జిల్లాలోని పలు గ్రామాల్లో పైసలు తీసుకున్న ఓటర్లు తిరిగి వాపస్ ఇస్తున్నారు. ఎన్నికల్లో విజయం కోసం పోటీచేసిన అభ్యర్థులు భారీగా అప్పులు తీసుకొచ్చి, మరికొందరు ఉన్న భూములను తాకట్టు పెట్టి మరీ ఎన్నికల్లో ఖర్చు చేశారు. తీరా ఎన్నికల ఫలితాలు తేడా కొట్టడంతో వారంతా తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తెగ మదనపడుతున్నారు. కొందరైతే ఏకంగా ఏడుస్తూ శాపనార్థాలు పెడుతుండటం, మరికొందరు తమకు ఓటు వేయలేదని అనుమానం వచ్చిన వారితో ప్రమాణం చేయిస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో ఓటర్లు గుట్టుచప్పుడు కాకుండా పోయి పైసలు వాపస్ ఇస్తున్నారు.
కుల సంఘాలు, యువజన సంఘాలు
ఎన్నికల్లో విజయం కోసం పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తమ ఊళ్లో ఉన్న కులసంఘాలు, యువజన సంఘాల ఓట్లను గుంపగుత్తగా వేయించుకునేందుకు భారీ మొత్తంలో సంఘం బాధ్యులకు అప్పజెప్పారు. ఆయా సంఘాల భవనాల నిర్మాణం, తదితర పనుల కోసం పెద్దమొత్తంలో ముట్టజెప్పారు. తీరా ఎన్నికల్లో సదరు అభ్యర్థులు ఓడిపోవడంతో ఆయా సంఘాలకు ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తుండటంతో ఆయా పైసలను కులసంఘాల నేతలు ఓడిన అభ్యర్థులకు అప్పజెప్పుతున్నారు.
గెలిచినోళ్లలోనూ దిగులే..
ఎన్నికల్లో ఓడిన వాడు రోడ్డుపైన ఏడిస్తే, గెలిచినోడు ఇంట్లో ఏడుస్తున్నాడు.. అన్న విధంగా జిల్లాలో పలువురు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల్లో కనిపిస్తోంది. ఓడినోడు బహిరంగంగా బాధపడుతుంటే, గెలిచి సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేసిన నేతలు చేసిన ఖర్చు ఎట్లా తిరిగి రాబట్టుకోవాలో ఆర్థంకాక, ఇచ్చిన హమీలు ఎలా నెరవేర్చాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత ఆయా జీపీల్లో పెండింగ్ బిల్లులు, ఆదాయ వ్యయాలు చూసి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాకపోతే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని లోలోపల వాపోతున్నారు.


