
ఓవర్ టు మినిస్టర్
కేంద్రమంత్రి సంజయ్ వద్దకు పంచాయితీ
● బీజేపీలో ముదిరిన గ్రూపు రాజకీయాలు ● జాతీయ, రాష్ట్రస్థాయి నేతలకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
పెద్దపల్లిరూరల్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లోని అంతర్గత కలహాలు ముదిరి పాకాన పడ్డాయి. సమన్వయంతో పార్టీని పటిష్ట పర్చాల్సిన కమలనాథులు కయ్యానికే కాలుదువ్వుతున్నారు. అంతటితో ఆగకుండా సమస్య పరిష్కరించాలంటూ ఏకంగా కేంద్రమంత్రి బండి సంజయ్ చెంతకూ చేరారు. బీజేపీకి జిల్లావ్యాప్తంగా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఎంతో ఆదరణ ఉన్నా.. ఆ పార్టీ నేతలు ఏకతాటిపైకి రాకపవడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాదు.. పార్టీ పటిష్టత కోసం పనిచేసే నాయకులకూ కష్టాలు తెచ్చిపెడుతోంది.
కేంద్రమంత్రి ‘బండి’ ఇంటి ఎదుట నిరసన
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని పెద్దపల్లికి చెందిన పలువురు నాయకులు శనివారం కరీంనగర్‌లోని కేంద్రమంత్రి బండి సంజయ్ నివాసం ఎదుట ఏకంగా నిరసన తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది. పా ర్టీ కోసం, ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం పనిచేయని సంజీవరెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా అప్పగిస్తారని వారు ప్రశ్నించారు. సంజీవరెడ్డి ఇటీ వల కారు కొనుగోలు చేయగా.. అక్కడకు మీరు(కేంద్రమంత్రి సంజయ్)వెళ్లడం ఏమిటని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ వ్యవహారాల విషయంలో తానేమీ జోక్యం చేసుకోనని సంజయ్ వారికి సర్ది చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
పోటాపోటీగా కార్యక్రమాలు..
మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులదే గతఎన్నికల వరకూ పెద్దపల్లిలో పట్టు ఉండేది. ఆ ఎన్నికల్లో దుగ్యాల ప్రదీప్‌కుమార్ టికెట్ దక్కించుకోవడంతో బీజేపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ప్రదీప్‌కుమార్‌కు మద్దతుగా పనిచేయక పోగా ప్రత్యర్థి పార్టీ నేతలతో చేతులు కలిపి బీజేపికి తీరని నష్టం చేశారని దుగ్యాల ప్రదీప్ వర్గీయులు ఎదుటి వర్గం వారిపై బాహాటంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. పెద్దపల్లి సెగ్మెంట్‌కే చెందిన ఆయన ఈ ప్రాంత ప్రజలకు పరిచయమే లేదని, రాష్ట్ర, జాతీయస్థాయి నేతలతో ఉన్న పరిచయాలతో అసెంబ్లీ టికెట్ సాధించుకుని పార్టీకి నష్టం కలిగిస్తున్నారని గుజ్జుల వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో పెద్దపల్లిలో గుజ్జుల, దుగ్యాల వర్గీయులు ఇటీవల వేర్వేరుగా సంబురాలు నిర్వహించడం వారిలోని ముఠా తగాదాలను మరోసారి వెలుగులోకి తెచ్చినట్లయ్యింది. శుక్ర వా రం నాటి హోలీ వేడుకలను సైతం పోటాపోటీగానే జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది.
జిల్లా అధ్యక్షుడిని మార్చాల్సిందే..!
జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీపడగా కేంద్రమంత్రి సంజయ్ సూచన మేరకు కర్రె సంజీవరెడ్డికి బీజేపీ అధిష్టానం పగ్గాలు కట్టబెట్టిందనే ప్ర చారం ఉంది. బాధ్యతలను చేపట్టిన నాటినుంచే జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని కొందరు నాయకులు సంజీవరెడ్డి నియామకంపై గుర్రుగా ఉన్నారు. పెద్దపల్లిలో సంజీవరెడ్డి ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మినహా ఇతర ముఖ్య నేతలెవరూ హాజరుకాలే దు. సంజీవరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రా మకృష్ణారెడ్డితో కలిసి కార్యక్రమాలు నిర్వహి స్తూ పార్టీకోసం పనిచేస్తున్న తమకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ దుగ్యాల వర్గీయులు ఆరోపిస్తున్నారు.
పార్టీకి పట్టున్నా.. గ్రూపులతోనే నష్టం
మొన్నటి పట్టభద్రులు, ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను బీ జేపీ అభ్యర్థులే దక్కించుకోవడం పార్టీకి ప్రజల్లో ఉ న్న ఆదరణను తెలియజేస్తోందని నేతలు పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ పటిష్టత కో సం పనిచేయాల్సిన నాయకులు.. ఆధిపత్యం కో సం పార్టీని భ్రష్టు పట్టిస్తూ తమను గందరగోళానికి గురిచేస్తున్నారని కొందరు క్రియాశీలక కార్యకర్తలు వాపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తొ లిసారి పెద్దపల్లికి కేంద్రమంత్రి సంజయ్ రావడాన్ని ఓ వర్గం నేతలు జీర్ణించుకోలేకనే ఈ వివాదంలోకి లాగుతున్నారని ప్రత్యర్థి వర్గీయులు పేర్కొంటున్నారు. జిల్లాలో పార్టీ పటిష్టానికి ఏమాత్రం పనిచేయని వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టాలంటూ కేంద్రమంత్రి చెప్పడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాకు చెందిన సోమారపు లావణ్య, చిలారపు పర్వతాలు లాంటి బీసీ నేతల్లో ఒకరికి అవకాశమిచ్చినా అభ్యంతరం లేదని చెప్పినా పట్టించుకోకుండా సంజీవరెడ్డికి కట్టబెట్టడం సరికాదంటున్నారు. వెంటనే సంజీవరెడ్డిని జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాలని వారు డిమాండ్
చేస్తున్నారు.
అందరినీ సమన్వయం చేస్తున్నా
బీజేపీ క్రమశిక్షణ గ ల పార్టీ. నా విధానాలు నచ్చకపోతే పార్టీ అధిష్టానానికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. కేంద్రమంత్రిని వివాదంలోకి లాగడం, సోషల్‌మీడియాలో ప్రచారం చేయడం సరికాదు. క్రమశిక్షణ పాటించని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. పార్టీ పటిష్టత కోసం పనిచేసే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుంది. – కర్రె సంజీవరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

ఓవర్ టు మినిస్టర్

ఓవర్ టు మినిస్టర్